పుట:Gurujadalu.pdf/457

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

- గిరీశ : (కొత్త మనిషితో) అయితే, దాసోహం ! - టు ది అన్నోన్! (నిష్క్రమించుతూ గుమ్మము దగ్గరకు వెళ్లి తిరిగి చూసి కొత్త మనిషిని బతిమాలుకున్నట్లు అభినయించి, వెళ్లును. ) సౌజ : గిరీశం గారు కవి మహా యోగ్యవైఁన చిన్నవాడు. కొత్త మనిషి : వితంతువులను పెళ్లాడడం, యాంటీనాచీ కూడా మంచికి ఆవశ్యకవేఁనా అండి? సౌజ : వితంతువులను, యిష్టమైతే పెళ్లాడవొచ్చును. లేకుంటే మానవొచ్చును. మంచితో దానికి పనిలేదు. గాని వేశ్యా సంసర్గ కలవాడు యెన్నడూ మంచివాడు కానేరడు. కొత్త మనిషి : అంతేనా అండి, లేక వేశ్యను చూడరాదు; వేశ్యతో మాటాడరాదు; వేశ్య పాట వినరాదు; అని నిర్నయం కూడా వున్నదా అండి? సౌజ : అలాంటి నిర్నయం వుంటే మరీ మంచిది. కొత్త మనిషి : తమరు యాంటినాచ్ అనుకుంటాను. సౌజ : ఔను. కొత్త మనిషి : (చిరునవ్వుతో) గిరీశంగారూ యాంటీనాచే కదా అండి? సౌజ : మీకు తెలియదా? ఆయన యాంటినాచికి గురువు. కొత్త మనిషి : ఆయన నాకు కూడా గురువులేనండి. సౌజ : అలాగనా? నాకు చాలా సంతోషం. కొత్త మనిషి : యీ విషయంలో చాలా కాలవాఁయి నాకు ఒక్క సందేహం వుండిపోయింది; క్షమిస్తే మనవి చేస్తాను. సౌజ : చెప్పండీ - తప్పేమి? కొత్త మనిషి : వేశ్యలను పాటకు పిలవకపోతే, వాళ్లు బతకడం యెలాగండి? సౌజ : పెళ్లి చేసుకుంటే సరి. కొత్త మనిషి : గిరీశంగారి లాంటి వారిని అనా తమ అభిప్రాయం? సౌజ : యెమిమాట అన్నారు! రేపో నేడో ఆయ్న ఒక పవిత్రమైన వింతువును పెళ్లికానై యున్నారు గదా, వేశ్యనా పెళ్లాడుతారు? కొత్త మనిషి : జపాన్ దేశంలో గెయిషాలని వేశ్యలు వున్నారనీ, వాళ్లని గొప్ప గొప్పవారు కూడా పెళ్లాడతారనీ యీ గిరీశం గారే కాబోలు చెప్పగా విన్నాను. జపాన్ దేశం గొప్పదేశం అని అంటారండి? గురుజాడలు కన్యాశుల్కము - మలికూర్పు 412