పుట:Gurujadalu.pdf/448

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గిరీ : నేను లుబ్ధావధాన్లుగారి తమ్ముణ్ణి నా పేరు గిరీశం అంటారు. నేను పరిక్షలు పాసైనవాణ్ణి; తెలిసిందా? హెడ్డు : వెధవముండని తగులుకుపోయిన మహానుభావుడివి నువ్వేనా? గిరీశం : డిఫమేషన్ అంటే మీకేమో తెలుసునా? నేను సౌజన్యారావు పంతులు గారి స్నేహితుణ్ణి - సాక్ష్యాలు యే రీతిగా వున్నాయో కనుక్కుని, అన్నయ్య గారికీ మీకూ సలహా చెప్పమని పంతులు గారు నన్ను పంపితే వచ్చాను. హెడ్డు : అలా అయితే మాకు మీరు సాయం చెయ్యాలి గాని, అబద్ధం లేకుండా సాక్ష్యం కావాలంటే ఈ భూప్రపంచకమందు యెక్కడైనా సాక్ష్యం అన్నది వుంటుందా? నా నెత్తిమీద యెన్ని వెంట్రుకలున్నాయో, అన్ని సాక్ష్యాలు చూశాను. పెద్ద పెద్ద వకీళ్లు తయారు చేసిన సాక్ష్యాలు కూడా చూశాను. మీరు అనుభవం లేక నీతులు చెబుతున్నారు గానీ, హైకోర్టు వకీళ్లు కూడా తిరగేసి కొట్టమంటారు. నీ పుణ్యం వుంటుంది బాబూ, నిజం అబద్ధం అని తేలగొట్టక, యేదో ఒక తడక అల్లి తయారు చేస్తే గాని ఆబోరు దక్కదు. అన్నయ్యకీ, మీకు సహాయం చెయ్యడం కోసం కాకపోతే యింతదూరం నుంచి నేను యెందుకు వచ్చాను? మీ యిష్టవొచ్చినట్టల్లా మీకు పనికి వొచ్చే, అబద్ధాలు మీరు పలికించడముకు, నా అభ్యంతరం యెంత మాత్రం లేదు. ఎబ్ స్ట్రాక్టు ట్రూత్ అనగా సుసత్యవఁనేది, సాక్షాత్తూ భగవంతుడితో సమానమైన వస్తువ అన్నమాట మాత్రం మరిచిపోకూడదని నా అభిప్రాయము. నేను మట్టుకు నిజం కోసం సమయం వస్తే సంతోషముతో ప్రాణం యిచ్చేస్తాను. “లోకో భిన్న రుచి!” అన్నాడు. కొందరికి కందిపప్పు పచ్చడి రుచి; కొందరికి పెసరపప్పు పచ్చడి రుచి; కొందరు అదృష్టవంతులికి, రెండు పచ్చళ్లూ రుచి, అలాగనే, కొందరికి అబద్ధం రుచి. కొందరికి నిజం రుచి; చాలా మందికి రెండింటి కలగలుపు రుచి యిది లోక స్వభావం. గనక అవసరం కలిగినప్పుడు తణుకూ బెణుకూ లేకుండా, అబద్ధం ఆడవలసిందే - ప్రస్తుతాంశంలో, అసిరిగాడి చేత అబద్ధం ఆడించడం నాది పూచీ. అసిరీ - నా తడాఖా జ్ఞాపకవుఁందా, కబడదార్ - సాక్ష్యం ఇవ్వకపోతే చంపేస్తాను. హెడ్డు : అలా తోవలోకి రండి భాయీ - చర్మం చెప్పులు కుట్టి యిస్తాను. (లుబ్ధావధాన్లుతో) ఆ ఛండాలుడు రావఁప్పంతులుని నమ్మక, యిలాంటి కావలసినవాళ్ల మాట వింటే; మీకు యీ గతి రాకపోవును గదా?

గురుజాడలు 403 కన్యాశుల్కము - మలికూర్పు