పుట:Gurujadalu.pdf/432

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామన్న : ఒక మిట్టకాయలో పలారం జాగర్త చేస్తాం గురూ. మా రాంమందిరానికి దయసెయ్యాలి. బైరాగి : పద - యీ వూరి వింతలేవిఁటి? - లచ్చన్న : యేటీలేవ్ - రావఁశంద్రపురం అగ్ఫురోరంలో ముసలబాపనోడు ఆల్ని సంపేసినాట్ట. ఆడికీ దొంగసాచ్చికం పలికినోళ్ళకీ తాసీలు గోరికీ సిచ్చైపోతాదిట. బైరాగి : ఈ వూరు పాపంతో నిండి వున్నట్టు కనపడుతూంది. యీ వూళ్లో మేము నిలవము. రామన్న : లచ్చువుఁడు వెజ్జోడు గురూ. ఆడిమాట నమ్మకండి. మీరెళ్లిపోతే మాలాటోళ్లు తరించడం యలాగ్గురూ? ఆళ్లు వూరోళ్లు కారు. బుచ్చన్న: ఆ వూరి దుకాణదారు గారు అదుగో వొస్తున్నారు. బైరాగి : యీ వూళ్ళో తాగడం లావుగా వున్నట్టు కనపడుతుంది. మేము తాగుబోతులతో మాట్లాడం ఆ దుకాణదారు వచ్చేలోగా యీ సందులోకి మళ్లిపోదాం. రండి (దుకాణదారు పరుగున వచ్చి కలిసి బైరాగి మొలలో చెయివేసి పట్టుకొనును.) దుకా : రూపాయలు కక్కి మరీ కదలాలి! బైరాగి : యేమిటీ వాళకం! వీడు తప్పతాగి పేలుతున్నాడు - నేను మొదటే చెప్పలేదా యీ వూరి సంగతి? అంతా పాపంతో నిండి వుంది! వేమన్న యేమన్నాడు? “తాగుబోతుతోడ! తగదెందు నేస్తంబు” రామన్న: (దుకాణదారుతో) భాయీ! మీకేటి, మతోయిందా? గురువుగోరికి దణ్ణవెంట్టి లెంపలోయించుకొండి. దుకా : గురువూ లేదు, గుట్రా లేదు. వూరుకోస్సి - యీడెక్కడ గురువు? నాదుకాణంలో సారా అంతా చెడ తాగి డబ్బియ్యకుండా యెగేసినాడు. రామన్న: మీకు మతోయిందా భాయి! ఆరేటి మీ దుకాణంలో తాగడవేఁటి? కాశీ నించి యిప్పుడే ఒచ్చినారు గదా? దుకా : ఆకాశం బొక్క చేసుకుని వొచ్చాడు కాడూ? (బైరాగితో) డబ్బిచ్చి మరీ కదులు. బైరాగి : మావంటి సాధులతో నీకు వాదెందుకు అబ్బీ? యవర్ని చూసి మేవఁనుకున్నావో! మమ్మల్ని పోలిన దాసరి వాడొకడు, బైరాగి వేషం వేసుకుని యీ దేశంలో తిరుగు తున్నాడు. కిందటి మాటు మేం దేశ సంచారం చేసినప్పుడు చూసి చివాట్లు పెట్టాం. నీకు డబ్బు మీద అంత కాపీనం వుంటే కులం రాగి తెచ్చుకో బంగారం చేసి యిస్తాం. సంగోరు ధర్మ ఖర్చు చేసి సంగోరు తిను. లేకుంటే తల పగిలిపోతుంది. కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 387