పుట:Gurujadalu.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మధు : చాలించండి. యిక విజయం చెయ్యండి. (వెళ్లిపొమ్మని చేతితో సౌజ్ఞ చేయును. కర టక శాస్త్రులు, శిష్యుడు నిష్క్రమించుచుండగా) శాస్తుల్లు గారూ! (కరటక శాస్తుల్లు తిరిగి ప్రవేశించును.) మధు : మీ పిల్లని మహేశానికి యిస్తారా? కరట : యిస్తాను. మధు : అయితే నాకో ఖరారు చేస్తారా? కరట : చేస్తాను. మధు : యిక అతణ్ణి నాటకాలాడించీ, ముండలిళ్లతిప్పీ చెడగొట్టకండి. కరట : యిటుపైని చెడ్డగొట్టను - నాకు మాత్రం అక్కర్లేదా? (పొడుం వీల్చి) నీది గురూపదేశం, మధురవాణీ! మధు : బ్రాహ్మలలో ఉపదేశం లావూ, ఆచరణ తక్కువా, ఖరారేనా? కరట : ఖరారే. మధు : బ్రాహ్మలు కాగానే, దేవుఁడికంట్లో బుగ్గిపొయ్య లేరు అనుకుంటాను. కరట : చివాట్లకి దిగావేఁవిటి? మధు : చిత్రగుప్తుడికి లంచం యివ్వగలరా? అతడి దగ్గిరకి మధురవాణిని పంపి, చేసిన పాపాలు అన్నీ తుడుపు పెట్టించడానికి వీలువుండదు కాబోలు? కరట : మధురవాణీ! జరూరు పనివకటుంది. మరిచి పోయినాను - వెళ్లి, రేపు మళ్లీ వస్తాను. మధు : (నవ్వు చేత కుర్చీ మీద విరగబడి, తరవాత నవ్వు సమాళించుకొని) ఒక్క నిమిషం ఆగండి. శిష్యుడా! (శిష్యుడు ప్రవేశించును) యేదీ, నాడు నువ్వు రామచంద్రపురం అగ్రహారంలో, రామప్పంతులు యింటి బైటనూ, నేనూ మీనాక్షమ్మా తలుపు యివతలా అవతలా ఖణాయించి వుండగా, తెల్లవార ఝావుఁన నిశ్శబ్దంలో ఆకాశవాణిలా పాడిన చిలక పాట పాడి నీ మావఁగారికి బుద్ధి చెప్పు. తమ మూలంగా ఒక ముసలి బ్రాహ్మడికి ముప్పు వస్తూ వుంటే తమశరీరం దాచుకుంటున్నారు. శిష్యుడు : (పాడును) యెఱ్ఱని ముక్కుగలది రామచిలుక! దాని.... మధు : (బెత్తముతో కొట్టబోయినట్లు నటించి) చెప్పిన పని చెయ్యకపోతే జయిలు సిద్ధం. శిష్యు : (“యెన్నాళ్ళు బ్రతికినా” అను పాట పాడును. రెండు చరణములు పాడిన తరువాత). కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 382