పుట:Gurujadalu.pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

11వ స్థలము : విశాఖపట్టణంలో (మధురవాణి యింటి యదటివీధి కొసను కరకటశాస్త్రి, శిష్యుడూ ప్రవేశింతురు) కరట : నువ్వు ఆ కంటే వాళ్ల నెత్తిని కొట్టకుండా లేచి రావడం నుంచి, యీ ముప్పంతా వొచ్చినట్టు కనపడుతుంది. శిష్యుడు :మధురవాణి కంటే మధురవాణికి యివ్వడం తప్పా అండి? కరట : తప్పు కాదా? నువ్వు యిచ్చావని, మరి అది వొప్పుకుందా? "తే, ధగిడీకే కంటే తెస్తావా, చస్తావా?” అని రామప్పంతుల్ని పీకి పిండెట్టింది. దాని బాధపడలేక, ఆ రావఁప్పంతులు కూనీ కేసని యెత్తు యెత్తాడు. ఆ ముసలాడికి సిక్ష అయిపోయిందంటే, బ్రహ్మహత్య నా మెడకి చుట్టుకుంటుంది. నువ్వు అంటూ ఆ కంటే వాళ్ల యింట వొదిలేస్తే, నాకు ఈ చిక్కు లేకపోవును గదా? శిష్యుడు : వెధవముండ గూబగదలేస్తూంటే, కంటే గింటే యవడికి జ్ఞాపకం వొస్తుందండి? చేయి కరిచి, పెట్టె తీసి, మెహురు అంకించుకుని, చెంగున గోడ గెంతాను. పజ్యండువొందలు మీరు పట్రాగా, నాకు పెళ్లిలో పెట్టినకంటే నేను తెచ్చాననా, తప్పు పట్టుతున్నారు? ఆ కంటే అయినా దక్కిందా? చూస్తూనే మధురవాణి లాక్కుంది. కరట : నేను హాస్యగాడ్డే గాని, యీ కూనీ గడబిడతో నా హాస్యం అంతా అణిగిపోయింది. గనక యిక హాస్యంమాను - నేను తీసుకున్న రూపాయలు, లుబ్ధావధాన్లుకి యప్పటికైనా పంపించడానికే తలచాను! అంతే గాని అపహరిద్దామని అనుకోలేదు - మధురవాణిని యలాగైనా లయజేసి, కంటె యరువు పుచ్చుకుని, ఆ కంటా, యీ రూపాయలూ, బంగీకట్టి అవుధాన్లుకి పంపించేస్తే, కూనీ నిజం కాదని పోల్చుకుంటారు. నాకు ఈ బ్రహ్మహత్య తప్పిపోతుంది. శిష్యుడు: మీ నాస్తులు సౌజన్యారావు పంతులు గారితో నిజం చెప్పెయ్యరాదా అండి? కరట : వెళ్లి కుదిరింది, రోకలి తలకి చుట్టమనన్నాట్ట! వెనకటికి యవరో పోలీసు, తల్లి కూరగాయలు పుచ్చుకుంటే జుల్మానా వేశాట్ట; సౌజన్యారావు పంతులు అలాటి వాడు. ఆయనతో మనం వున్నమాట చెప్పావఁంటే ఆయన నిజం కోర్టులో చెప్పేస్తాడు. ఆపైని లుబ్ధావధాన్లు పీక వురి, మన పీకకి తగులుకుంటుంది. శిష్యుడు : 'మన' అంటున్నారేవిఁటి? కరట : మాట పొరపాటురా. రావఁప్పంతులు వూరికి వెళ్లిన మాట నిజవేఁనా? శిష్యుడు : నిజవేఁ గురుజాడలు 373 కన్యాశుల్కము - మలికూర్పు