పుట:Gurujadalu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాకేమిటి అన్న రాజకీయ డిమాండ్ నుంచి మేమేమిటి అన్న తాత్విక ప్రశ్నవైపు భారతీయ సమాజంలోని అశేష సమూహాల ప్రయాణం ఇప్పుడిప్పుడే ఆరంభమయింది.

ఈ దశలో అడుగడుగునా గిరీశాలు ఎదురవుతుంటారు. వీరివద్ద పదిమందినీ చుట్టూ తిప్పుకోగల సామర్థ్యమేదో ఉంటుంది. మాటకారితనం ఉంటుంది. తాము మాటలాడుతున్న దానికి జవాబ్దారీలేనితనం ఉంటుంది. ఈ క్షణం పబ్బం గడవటం కోసం ఎంతకైనా తెగించగలతనం ఉంటుంది. వీరు అభ్యుదయ చింతకుల వేషంలో ఉంటారు. తమ వ్యక్తిగత సామర్థ్యాలను ఆ వేషం రక్తికట్టటానికే ధారపోస్తారు. అమాయకులైన బుచ్చమ్మలను ఉద్దరించటానికే పుట్టామంటారు. తోలుబొమ్మలాటలో కేతిగాడు, బంగారక్కల లాగ వచ్చి నిద్రపోతున్న జనాన్ని లేపటానికన్నట్లు కబుర్లు చెప్పటమే గిరీశాల పాత్ర. చప్పట్లే వారి లక్ష్యం. చడీచప్పుడూ లేకుండా సొమ్ము చేసుకునేవారి కన్న, చప్పుడు చేస్తూ దృష్టి నిలవకుండా మరల్చే గిరీశాలే సమాజంలో అయోమయం సృష్టించటంలో ముందుంటారు.

ఈ గిరీశాలు సాహిత్యంలో, ఉద్యమాలలో ప్రతి కార్యాచరణ రంగంలో, భావ రంగంలో తారసపడుతూనే ఉంటారు. తన కాలపు గిరీశంతో డామిట్ కథ అడ్డం తిరిగింది అనిపించగలిగాడు గురజాడ. ఈనాటి, రేపటి గురజాడలు తమ చుట్టూ ఉండే, తమలోనే ఉండే గిరీశాలతో ఆ మాట అనిపించవలసిన అవసరం ఎప్పుడూ ఉంటుంది. ఆ గిరీశాలు లేని సమాజం మానవజాతి రూపొందించుకునే వరకూ ఆ అవసరం ఉంటూనే ఉంటుంది.

6

రాబోయే పాతిక ముప్ఫై ఏళ్ల కాలం భారతీయ సమాజానికి, అందులోని తెలుగు సమూహానికీ ముఖ్యమైన దశ. సమాజంలో అన్ని సమూహాలూ కలసి కష్టసుఖాలు కలబోసుకుంటూ, ఒకరి సమస్యలను ఒకరు తెలుసుకుంటూ, చర్చించుకుంటూ ముందుకు వెళ్లగల సందర్భం శతాబ్దాల బహుశా సహస్రాబ్దాల తర్వాత తొలిసారి ఏర్పడింది. ఆలోచనా పరుల సంఖ్య పెరుగుతోంది. దాంతో రాసేవారూ, అసంఖ్యాకంగా చదివేవారూ పెరుగు తున్నారు. ఈ సామాజిక సందర్భాన్ని సాహిత్యంలో ప్రతిఫలించవలసిన రచయితలు స్వంత వివేచనతో, బాధ్యతతో రాయటమే కర్తవ్యం. అనేక సమూహాలకు చెందిన వీరు గురజాడ వంటి వారిని కొత్తగా పరిశీలిస్తారు. వ్యక్తులుగా, సమాజ చలనంలో పాల్గొన్న శక్తులుగా వారిని గురించి ఆలోచిస్తారు. తమ ముందున్న కర్తవ్యాలను, ఆచరణలను ప్రోదిచేసుకోటానికి వెనకటి వారిలో ముందు చూపున్న వారి కోసం వెదికినపుడు గురజాడ