పుట:Gurujadalu.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొండి : చిత్తం! రామ : పెళ్లిలో యేవిఁటోయి గమ్మత్తు కొండి :యేవీఁ గమ్మత్తు లేదండి. రామ : మధురవాణి పాడింది కాదేం? కొండి: పాడింది రామ : ఆఁ! కొండి: కాదండి. రామ : అలా చెప్పు. అంత సేపూ హెడ్డు కనిష్టీబుతో మాట్లాడుతూంది కాబోలు? కొండీ : లేదండి. ఒక్క మాటాళ్లేదు. రామ : మరెందుకన్నావూ, మాట్లాడిందని యిందాకానూ? విరగబడి నవ్విందన్నావే. కొండి : మరీ - మరీ - మరే వొచ్చి- లింగన్న గారి కాంభొట్లు అలా అనమన్నాడు. రామ : వాడిపని పట్టిస్తాను. నాతో వెకాస్యాలా! నువ్వు మాత్రం వాడి జట్టు కూడకు. చిన్నప్పట్నుంచీ నిన్ను యెరుగుదును. నువ్వు నిజాయితీ మనిషివి. కొండి : అవుఁనండి. యెప్పుడూ నేను నిజవేఁ చెబుతాను. రామ : అవును గాని, హెడ్డు కనిష్టీబు మాట మట్టుకు నిజం చెప్పావు కావు. పట్టాభిరామస్వావిఁ మీద ప్రమాణం చేసి, చెప్పు! మధురవాణి యవరెవరితో మాట్లాడింది? కొండి : మరే వచ్చి - నిజం చెప్పమన్నారూ? రామ : నిజాయితీ మనిషివనే గదా నిన్ను అడుగుతున్నానూ? కొండి : అయితే, - అందరితోటీ మాట్లాడింది. రామ : అందరితోటీ అంటే యవరెవరితోటి? కొండి : యవరెవరా అండి? పెళ్లి వొదిలేసి, అంతా మధురవాణి చుట్టూ మూగాం. భుక్తగారితో మాట్లాడిందీ, మరే వచ్చి రామ : యింకా యవరితో మాట్లాడింది? కొండి : సిద్ధాంతి మంత్రం చప్పడం మానేసి మధురవాణి చెవులో యేకాంతం మాట్లాడాడు. రామ : మరింకా యవరితోటి? కొండి : మరేవచ్చి - హెడ్డు కనిష్టబు తోటి. కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 310