పుట:Gurujadalu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రమంగా బలపడింది. ఆధునికతను ఒక మలుపుగానూ, అభ్యుదయాన్ని ఒక మార్గం గాను భావించేవారు. కాలక్రమంలో ఆ రెండూ గతం పట్ల కించాదృష్టినీ, అవహేళననూ వ్యక్తం చేస్తున్నాయన్న భావన బలపడ్డాక గురజాడ అభిమానుల ధోరణిని, 'అతి'నీ ఎదుర్కొనే క్రమంలో గురజాడను అభిశంసించేందుకు కొందరు ప్రయత్నించారు. గురజాడకీ, వీరేశలింగానికి మధ్య భేదం, దానిని పరాస్తం చేయటానికి ఆయన డైరీలో ప్రక్షిప్తాలూ వంటివి రాతలకు ఎక్కాయి. ఆరంభ వ్యతిరిక్తత సృష్టించిన చెవికొరుకుళ్లు రాతలకు ఎక్కాయి. కన్యాశుల్కం కర్తృత్వం కూడా గురజాడది కాదన్న వివాదం సైతం వచ్చింది. సెట్టి ఈశ్వరరావు, అవసరాల సూర్యారావు, కట్టమంచి రామలింగారెడ్డి, నార్ల, శ్రీశ్రీ, ఆరుద్ర, కె.వి.రమణారెడ్డి వంటి వారి కృషి, ఆరాధనల వల్ల గురజాడ సృజన తెలుగు వారి గుండెలకు హత్తుకుంది. రచనల సేకరణ, పరిశీలన, వివరణలతో వారి కృషి ప్రతి ఫలించింది. కె.వి.ఆర్, ఆరుద్రల నిశితమైన పరిశీలనలలో వివరాల సేకరణ, విశేషాల వివరణ తెలుగు ఆలోచనా పరులకు గురజాడను నిత్యనూతనం చేసాయి. గొప్ప పరిశోధనా లక్ష్యంతో బ్రౌన్‌నీ, గురజాడనీ పరిశోధించిన బంగోరె (బండి గోపాలరెడ్డి)ని 'సత్య' ఆరాధకునిగానే గాని, 'వ్యక్తి' లేదా 'ఆదర్శ’ ఆరాధకునిగా నేను భావించలేను. ఆయన కృషితో మొదటి కన్యాశుల్కం తిరిగి వెలుగులోకి వచ్చింది..

ఒక దశలో గురజాడకి లభించిన గుర్తింపు, ప్రచారం కమ్యూనిస్టులు పనిగట్టుకుని చేసిందన్న వారు ఉన్నారు. తెలుగు సాహిత్యంలో కమ్యూనిస్టుల ప్రవేశానికి ముందు గురజాడపై వచ్చిన వ్యాసాలను విడిగా పరిశీలించి ఆ భావాన్ని గట్టిగా ఖండించటం జరగలేదు. ఆయనపై అవిరళ కృషి చేసిన వారు ఆ వ్యాసాలను పరిశీలించినా, ఈ విమర్శను చూసీచూడనట్టు ఉపేక్షించారు.

ఆ తరువాత దశలో గురజాడ, కందుకూరిలను కాట్రేడ్లుగా కమ్యూనిస్టులు గౌరవించడం కొత్త వ్యతిరేకులను తయారు చేసింది. వారు ఏదో ఒక నెపంతో గురజాడపై ధ్వజం ఎత్తిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వారిని ఆంగ్లేయుల బానిసలుగా, దేశభక్తి లేనివారిగా, లైంగికనీతి బాహ్యులుగా చూపెట్టటానికి ప్రయత్నించారు. ఈ కాలమంతా ఇవేవీ పట్టించుకోకుండానే చదివే జనం గురజాడను చదువుతూనే ఉన్నారు. నేర్చేది నేరుస్తూనే ఉన్నారు. ఆనందించేది ఆనందిస్తూనే ఉన్నారు.