పుట:Gurujadalu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మరికొందరు. ఈ కారణంతో దాన్ని, ఆ కారణంతో దీన్ని వ్యతిరేకించినవారు ఇంకొందరు. స్వకులాన్ని రచ్చకీడ్చిన కులద్రోహి అని భావించిన వారు కొందరైతే, శాఖాభేదాలతో ఆగ్రహించిన వారు కొందరు. వారిలో సాంప్రదాయ నిరాకరణను సాంప్రదాయ పతనంగా ఎంచినవారిని మరింతగా పరిశీలించాలి. అప్పటికి ఆంగ్లవిద్య కొత్త ఉపాధి మార్గాలను తెరిచిందన్నది బ్రాహ్మణ కుటుంబాలకు పూర్తిగా తెలుసు. ఆ విద్య వేషభాషలను మార్చింది. ఆ ఉపాధులు డబ్బు అన్నదాని శక్తిని అర్థమయేట్టు చేసాయి. అదే సమయంలో అంత వరకూ ఆయాచితంగా పదవితో సంబంధం లేకుండా, పుట్టుకతో సంక్రమించిన ఆధిక్యతతో అనుభవించిన తోటి మనుష్యుల ‘విధేయత' తగ్గుముఖం పట్టటం వారిని అభద్రతకి గురి చేసింది. దానికి కారకులైన స్వసమూహంలోని గురజాడ, కందుకూరి వంటి ఈ ద్రోహులను ఎలా ఎదుర్కోవాలి? సామాజిక దోషాలుగా వారు ఎత్తిచూపుతున్న వాటిని కాదని, అవి ఎలా సమాజానికి అవసరమో వారి మార్గంలో - అంటే పత్రికలలో, సాహిత్యంలో, తర్కంతో వాదించాలి. ఆనాటి పత్రికలలో శారదా చట్టానికి (వివాహ వయోపరిమితిపై 1930-34) కనిపించిన పాటి వ్యతిరిక్తత, కన్యాశుల్కం, విధవా వివాహం వంటి సంస్కరణల విషయంలో కనిపించదు. వ్యతిరిక్తత ఉండకుండా ఉండే అవకాశం లేదు కనుక, దానిని బట్టి అది వ్యక్తం కాలేదు అని అర్థం చేసుకోవచ్చు. దానిని గురించి రాసినవారు కాని, పత్రికలు పెట్టినవారుగానిచాలా అరుదుగా కనిపిస్తారు. కారణం ఆనాటి 'అక్షరాస్యుల'లో వారి సంఖ్య తక్కువ. దాంతో వీరి వ్యతిరిక్తత చెవికొరుకుళ్ల (Scandals) రూపంలో ఎక్కువగా వ్యక్తమయింది. చాలా వరకూ దానికే పరిమితమయింది. గురజాడ విషయంలో ఆయన రాజ విధేయత, జీవనశైలి, ప్రవర్తన వంటి వ్యక్తిగత అంశాల నుంచి అనేక లైంగికనీతి పతనాలను వదంతులకు సరుకుగా తయారు చేసుకున్నారు.

ఇక సాహిత్య విషయానికి వస్తే గురజాడ, గిడుగుల వాడుకభాషా ప్రతిపాదనకు వ్యతిరిక్తత చాలా గట్టిగానే బహిరంగమయింది. విశ్వవిద్యాలయాలలో గ్రాంథిక భాషను నిలబెట్టటానికి చాలాకాలం వరకూ ప్రయత్నాలు సాగాయి.

మోడర్న్, ప్రోగ్రసివ్ అన్న ఆంగ్ల పదాలకు సమానార్థకంగా వాడుతున్న ఆధునిక, అభ్యుదయ పదాలకు పర్యాయ పదంగా గురజాడను ప్రశంసించటం ఆరంభమయి,