పుట:Gurujadalu.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామ : (గతక్కుమని తిరిగిచూసి) మావాఁ పడుచువాళ్లం గదా? అయినా, నా మధురవాణిని నేను నడివీధిలో ముద్దెట్టుకుంటే, నన్ను అనేవాడెవడు? మధు : నడి కుప్పమీద యెక్కి ముద్దు పెట్టుకోలేరో? పెంకితనానికి హద్దుండాలి, బావగారికి దండాలు, దయ చెయ్యండి (కుర్చీ తెచ్చి వేయును) రామ : నాకు మావఁగారైతే, నీకు బావగారెలాగేవిఁటి? మధు : మా కులానికి అంతా బావలే. తమకు యలా మావఁలైనారో? (లుబ్ధావధాన్లుతో) కూచోరేం? యేమి హేతువో గాని బావగారు కోపంగా కనబడుతున్నారు. రేపు పెళ్లిన తరవాత అక్కగారిని, వీధి తలుపు గడియ వేసి మరీ ముద్దెట్టుగుంటారేమో చూస్తాను గదా? అయినా మీ అల్లుడుగారికి చిన్నతనం యింకా వొదిలింది కాదు. రామ : పైలా పచ్చీసీలో, చిన్నతనం కాక పెద్దతనం యలా వొస్తుంది? యేం మావాఁ! కోపవాఁ? లుబ్దా : : నాకు పెళ్లి వాద్దు పెడాకులూ వొద్దు రామ : (మధురవాణి చెవిలో) చూశావా మధురం, నా యంత్రం అప్పుడే పారింది. (పైకి లుబ్ధావధాన్లుతో) అదేం, అలా అంటున్నారు? నిశ్చయం అయిన తరువాత గునిసి యేం లాభం? లుబా : నీ సొమ్మేం పోయింది? గునియడం గినియడం కాదు. నాకీ పెళ్లి అక్కర్లేదు. మధు : (రామప్పపంతులు చెవిలో) యేమిటా వుత్తరం? రామ : (మధురవాణి చెవిలో) అగ్నిహోత్రావుధాన్లు పేరు పెట్టి నేనే బనాయించాను. మధు : (రామప్పంతులు చెవిలో) యేవఁని? రామ : (మధురవాణి చెవిలో) నువ్వు ముసలవాడివి గనక నీ సంబంధం మాకు వొద్దని. మధు : చిత్రం! చెప్పేస్తాను. రామ : (మధురవాణి చెవిలో) నీకు మతిపోయిందా యేమిటి? పెళ్లి తప్పించమని నువ్వే నా ప్రాణాలు కొరికితే, ఈ యెత్తు యెత్తాను, నోరుమూసుకో. మధు : (లుబ్ధావధాన్లు చెవిలో) యీ సంబంధం మీకు కట్టి పెట్టాలని పంతులు చూస్తున్నారు. వొప్పుకోకండి. రామ : (మధురవాణితో) యేమీ బేహద్బీ! (లుబ్ధావధాన్లుతో) స్త్రీ బుద్ధిః ప్రళయాంతకః అన్నాడు. దాని మాటలు నమ్మకండి. కల్పనకి యింత మనిషి లేదు. గురుజాడలు 286 కన్యాశుల్కము - మలికూర్పు