పుట:Gurujadalu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంస్థానాలే ద్వారాలు. దానికి సంస్థానాధీశుల అభిరుచులూ కారణం కావచ్చును. ఆంగ్ల పాలకుల ప్రోత్సాహమూ కారణం కావచ్చును. 17, 18, 19 శతాబ్దాలు ప్రపంచ తాత్విక చరిత్రలో ప్రధానమైనవి. ఆ పుస్తకాల ద్వారా నూతన భావాలూ, భావనలూ భారతదేశానికి చేరటానికి పట్టే కాలం 20, 30 సంవత్సరాలకు గణనీయంగా తగ్గింది. రాజుచేత గుర్తింపబడిన అప్పారావు గారికి అవి వెంటనే అందే వీలుకలిగింది.

6) సంస్థానాలను ఆశ్రయించుకుని జీవించేవి కళావంతుల కుటుంబాలు. వారివల్ల నాశనమైపోతున్న సంసారాలు కందుకూరి వారి దృష్టికి వస్తే వారు ఆరంభించినది ఏంటీనాచ్ ఉద్యమం. ఆనాటి పత్రికలను పరిశీలిస్తే వేశ్యల వివాహ ప్రయత్నాలు, వారే తమ ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల గురించి ప్రశ్నించడాలూ కనిపిస్తాయి. ఇలాంటి వాతావరణంలో వేశ్యల అసలు సమస్య గురించి ఆలోచించటానికి, పరిశీలించటానికి విజయనగర వాతావరణం, రాజప్రాపకం గురజాడకి ఉపకరించాయి.

ఈ పై చెప్పబడిన పరిస్థితులలో గురజాడ నిలువు రూపొందింది.

దానిని రెండింటిగా విభజించి అవగతం చేసుకోవచ్చు.

సమాజంలో మార్పులు అవసరం. దానికి సాహిత్యం వినియోగపడాలి - ఇది సమాజ సంబంధి.

సాహిత్యంలో కూడా మార్పులు అవసరం. అది వాస్తవికతను ప్రధానం చేసుకోవాలి. భాష కృతక స్థితి నుంచి వాస్తవికం కావాలి. అంటే వాడుకభాషలో రచన సాగాలి. వస్తువు, పాత్రలు వాస్తవ జీవితం నుంచి ఎంచుకోవాలి. అంటే అవి రచయిత భావాలు, నిలువు చెప్పే కీలుబొమ్మలు కారాదు. రచన మాత్రమే రచయిత హృదయం ఎటు మొగ్గి ఉన్నదీ చెప్పాలి. ఆ హృదయం ఎప్పుడూ మనిషిమీద కరుణ కలిగి ఉండాలి. - ఇది సాహిత్య సంబంధి.

ఇదీ గురజాడ నిలువు.

దీనివల్ల ఆయన సమాజంలోని మార్పులను సమర్ధించటంతో బాటు ఆ మార్పుల పేరిట పబ్బం గడుపుకునే స్వార్ధపరులనూ, కబుర్లరాయుళ్లనీ చూడగలిగాడు. తెలిసిన వాళ్లు ఎంత అవకాశవాదులుగా ఉండగలరో చూపగలిగాడు. తద్వారా ఆయన సాహిత్యానికి