పుట:Gurujadalu.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామ : ఆహా! యెం ధనరేఖా! సంతాన యోగ్యత బాగా వుంది. మధు : మీరు చేపట్టింతరవాత, అందుకు లోపం వుంటుందా? (సిరాబుడ్డిలోని సిరా రామప్పంతులు ముఖం మీద పోసి ఛఱ్ఱున వెళ్లిపోవును) 3వ స్థలము. కృష్ణా రాయపురం అగ్రహారంలో అగ్నిహోత్రావధాన్లు గారి ఇల్లు (వీధి-గుమ్మం యదట గిరీశం నిలిచి సన్నని గొంతుకతో పాడును) “కాముని విరిశరముల బారికి నే, నేమని సహింతునే, చెలి, యేమని సహింతునే?” వీడి తస్సాగొయ్యా, వీడి బాణాలు పువ్వులటోయి? ఆ మాట యవడు నమ్ముతాడు? వెర్రికుట్టే యెవడైనా నమ్మాలి గాని? అనుభవ వేద్యవైఁన దీని నిజం యేవిఁటంటే : మంచి పదును బట్టిన లోహం మొనకి, డయమండ్ పొయంట్ వేసి, పొయజన్లో ముంచి, కంటికి కనపడకుండా మంత్రించి విసురుతాడు. అంచేతనే పైకి గాయం కనపడదు గాని, పోలీసు వాళ్ల దెబ్బల్లాగ లోపల తహతహ పుట్టిస్తాయి. ఈ విడో బ్యూటీ చూస్తే యేమీ తోచకుండా వున్నది. అయితే యిదీ చెప్పినట్టలా వశమయ్యే మనిషి కాదు. పాతరస్తాలేం పనికి రాకుండా వున్నాయి. నా యక్ స్పీరియన్సూ, నా శృంగార చేష్టలూ గుడ్డి గవ్వంత పని చెయ్యకుండా వున్నాయి. యింత సింప్లిసిటీ యక్కడా కానలేదు. దీనికి లవ్ సిగ్నల్సు రామరామా! యేమీ తెలియవు. చమత్కారం మాటలు ఆడితే యేమిన్నీ అర్థం చేసుకోలేక ఆ లేడి కళ్లతో తెల్లబోయి చూస్తుంది. అయామ్ డ్రెడ్ఫుల్లీ యిన్ లవ్ విత్ హర్. దీన్ని చూసిన దగ్గర్నించీ టౌన్ లవ్ స్పూ, డాన్సింగర్లుసూ, మీద పరమాసహ్యం పుట్టింది. పోజిటివ్ యబహరెన్స్. వాళ్ల పెంకె మాటలూ, పెడర్థాలు, దొంగ వేషాలూ, డామిటీ! అంతా యిన్సిన్సిరిటీయేగదా? యిన్నాళ్లు మధురవాణి వలల్లో పడి యెలాగు యాస్ ని అయిపోయినానో నాకు నా మట్టుకే ఆశ్చర్యంగా ఉంది! మధురవాణికీ యీ మనిషికీ కంపారిజన్ వున్నదా? అది రంగు వేసిన గాజుపూస, యిది ప్యూర్ డైమండ్? కాదని యవడైనా అభాజనుడు అంటే అమాంతంగా వాడి పిలకూడదీస్తాను. దీనిని చెడగొట్టడానికి ప్రయత్నం చెయ్యకూడదు. చేసినా సాగేది కాదు. గనక కొత్త దారీ, కొంత న్యాయవైఁనదారీ తొక్కాలి. యేవిఁ టయా అదీ? మాయోపాయం చేసి దీన్ని లేవదీసుకుపోయి విడో మారియేజి గురుజాడలు 265 కన్యాశుల్కము - మలికూర్పు