పుట:Gurujadalu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎంతో పైస్థాయికి చెందిన అమూర్త (నైరూప్య, అరూప) భావనలతో ఈశ్వరుడిని ఏకదైవం చేసే ఎన్నో తాత్విక భావాలు వచ్చినా, సామాజిక అసమానతలను ధార్మిక పరిధిలోనే తొలగించటానికి కొన్ని ప్రయత్నాలు జరిగినా ఈ రెండు వ్వవస్థలూ సృష్టించిన సామాజిక అంతరాలను అవి గట్టిగా తాకలేక పోయాయి. భారతదేశపు సమూహాలకుగాని, వ్యక్తులకు గాని కష్టసుఖాలను ఒకే విధంగా అనుభవించే వీలు ఇవ్వలేక పోయాయి. ఒక సమూహంలోని దురాచారమనే దానితో తతిమ్మా సమూహాలకు వాస్తవిక సంబంధం లేకపోయింది. ఓ సమూహంలో రావలసిన మార్పులూ, దాని పట్ల వ్యతిరిక్తతా ఆ సమూహానికే సూక్ష్మస్థాయిలో పరిమితమై పోయాయి. స్థూలస్థాయిలో అది మొత్తం సమాజానికి చెందిన సంస్కరణగా చెప్ప బడినా, సూక్ష్మస్థాయిలో అది అనేకానేక సమూహాల దైనందిన కార్యకలాపాలకు సంబంధం లేనిదయింది. ఈ పరిస్థితి మార్పు వ్యతిరేకుల శక్తిని పెంచలేకపోయింది.

3) ఈ మార్పు వ్యతిరేకులు పొందిన విజయం ఏదైనా ఉందా అంటే వెలి వంటివి అమలు చేయటంతో పాటు, వారి స్మృతులు, శృతులు, వేదాలూ, ఉపనిషత్తులూ వంటి గ్రంథాల పరిధిలోనే మార్పు కోరేవారు వాదనలు చేయవలసి రావటం. ఆ భావనలూ, భాషా పరిధిలోనే రాజారామమోహన్ రాయ్ నుంచి, అంబేద్కర్ వరకూ తమ వాదనలు చేసారు. సమాజంలో అమలులో ఉన్న అనేక దురాచారాలు ఆ గ్రంథంలో లేవని చూపించటానికి తమ కాలమంతా వినియోగించవలసి వచ్చింది.

4) కందుకూరి వీరేశలింగం ఈ వాదనా విధానంలోనే పనిచేస్తూ, విధవా వివాహాలు జరిపించటానికి కొత్తగా పెరుగుతున్న ‘అక్షరాస్యుల'ను ప్రభావితం చేయటానికి సాహిత్య మార్గం చేపట్టాడు. కార్యకర్త అయిన ఈయనకు సాహిత్యం ఒక ప్రచార సాధనంగా కనిపించింది. ఈయన సాహిత్య సృజన హేళన ప్రధానంగా సాగింది. ఆనాటి చదువరి అయిన వెంటే సాగుతూ, దురాచారాలు లేదా మూఢవిశ్వాసాలతో బాటు అవి కలిగి ఉన్న వారిని హేళన చేయటం ద్వారా తాము ఇతరుల కన్న అంతో ఇంతో అధికులమన్న మానసిక ఆధిక్యతా భ్రమకు లోనవటానికి అవకాశం ఏర్పడింది. ఇది కందుకూరి వారి ఆచరణ రంగానికి అతికినట్లు సరిపోయింది.

5) గురజాడది విజయనగరం. ఈ నగరం ఒక సంస్థానం. దీని పాలకుడు ఆనంద గజపతి రాజు, పడమటి గ్రంథాలు, పత్రికలూ అప్పటిలో భారతదేశానికి చేరటానికి