పుట:Gurujadalu.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కరట : చూపితే అందుకు పోయేదానికి నీకు మిక్కిలి చెప్పాలా యేవిఁటి? మధు : యిదివరకి నిర్ణయవైఁన సమ్మంధం యేమ్మిష పెట్టి తప్పించడం? కరట : నీ బుద్ధికసాధ్యం వుందా? డబ్బుకసాధ్యం వుందా? మధు : బుద్ధికి అంతా అసాధ్యవేఁ కాని, డబ్బుకి యక్కడా అసాధ్యం లేదు, యీ పెళ్లిలో మా పంతులుకో పది రాళ్ళు దొరుకుతాయనుకుంటున్నాడే? కరట : నా సంబంధం చేసుకుంటే నేను యిరవై రాపాషాణాలు యిస్తాను. మధు : సరే. గానీ నాటకంలో యంతహాస్యవైఁనా చెల్లుతుంది. నటనలోకి హాస్యం తెస్తే యేవిఁ మూడుతుందో ఆలోచించారా? కరట : మధ్య నీకొచ్చిన ఫర్వాయేవిఁటి? నాకొచ్చిన ఫర్వాయేవిఁటి? యీ కత్తెరమీసం, కత్తెర గెడ్డం కడిగేసుకొని నా తోవని నే వెళతాను. యీ కోక నీ దగ్గిర పారేసి మా శిష్యుడు వెళతాడు. ఆ తరవాత యిదేవిఁటమ్మా యీ చిత్రవఁని నువ్వూ నలుగురమ్మలక్కలతో పాటు ఆశ్చర్యపడుదువు గాని. మీ పంతులుతో సిఫార్సు చేసి యీ మంత్రం యలా సాగిస్తావో గట్టి ఆలోచన చెయ్యి. మధు : మా పంతులు వక్కడివల్లా యీ పని కానేరదు. కరట : మరియింకా యవరి కాళ్ళు పట్టుకోవాలో చెప్పు? మధు : మా పంతులుతో మాట్లాడ్డం ఐన తరవాత అవుదాన్లు కూతురు మా నాస్తం మీనాక్షిని తండ్రికి తెలియకుండా చూసి, ఓ రెండు పెద్ద కాసులు యిస్తానని చెప్పండి. ఆ పైని సిద్ధాంతిని చూసి అతనికీ అలాగే ఆశ పెట్టండి. యీ పనికి సిద్ధాంతే కీలకం. నేను తెర వెనక నుంచి సమయోచితంగా హంగు చాస్తాను. కరట : నీ మాట వేరే నే చెప్పాలా? నిన్ను సంతోష పెట్టడం నాకు విధి. మధు : ఆ మాట మీరు శలవివ్వడం నాకు విచారంగా వుంది. వృత్తి చేత వేస్యని గనక చెయ్య వలసిన చోట్ల ద్రవ్యాకర్షణ చేస్తాను గానీ, మధురవాణికి దయా దాక్షిణ్యాలు సున్న అని తలచారా? మీతోడబుట్టుకి ప్రమాదం వొచ్చినప్పుడు నేను డబ్బుకి ఆశిస్తానా? యటుంచి యెటొచ్చినా కాపాడతాడు, హెడ్డు కనిస్టేబుకు మాత్రం కొంతం నిజం చెబుదాం. అతగాడు యిప్పుడే వస్తాడు, మాట్లాడతాను, మీరు యిక్కడ కూచోండి. కరట : స్వాధీనుడేనా? కొంపముంచడు గద? మధు : గులాం. (నిష్క్రమించును.) గురుజాడలు 258 కన్యాశుల్కము - మలికూర్పు