పుట:Gurujadalu.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హెడ్ : ఆడవాళ్లంటున్నావు, నువ్వు కూడా అందులోనే జమాయేవిఁటి? అహ! హ! రామ : హాస్యానికి వేళాపాళా వుండాలి. హెడ్ : నేను హాస్యం కోసం రాలేదు; యినస్పెక్టరు పేరు చెప్పి రావిఁనాయడిదగ్గిర పాతిక రూపాయ ల్లాగావట, యిలా యందరి దగ్గర లాగాడో రామఁప్పంతుల్ని నిల్చున్న పాట్లాన్ని పిలకట్టుకు యీడ్చుకురా అని నాతో ఖచ్చితంగా చెప్పి యినస్పెక్టరు పాలెం వెళ్లిపోయినాడు. రామ : చిన్నప్పుడు వొక్క బర్లో చదువుకున్నాం యినస్పెక్టరూ నేనూను. అంచాత అతని పిలక నేనూ నా పిలక అతనూ లాగినా ఫర్వాలేదు. రావిఁనాయడి మాట మాత్రం శుద్ధాబద్ధం. మీరు ముందు పదండి, గుఱ్ఱం కట్టించుకుని స్టేషను దగ్గిర కలుస్తాను. హెడ్ : నేనెలా వొస్తాను నీతోటి; నాకు వొల్లమాల్న పనుంది, ఒక కనిష్టీబుని నీతో పంపిస్తాను రామ : (హెడ్ చెవులో) నా యింట్లో మాత్రం నకార ప్రయోగం చెయ్యకు, నీ పుణ్యవుఁం టుంది. హెడ్ : అదా నీ ఘోష! అలాక్కానియి. (నిష్క్రమించును) రామ : (తనలో) అదుగో మళ్లీ ఏకవచనవేఁ కూస్తాడు! (పైకి) యవడ్రా అక్కడ. నౌఖరు: (ప్రవేశించి) సిత్తం బాబు. రామ : గుఱ్ఱం కట్టమను. నౌఖరు: సిత్తం బాబు. (నిష్క్రమించును) రామ : చూశావూ మధురవాణీ, నేన్నిలబడ్డ చోట రూపాయలు గలగట్రాల్తాయి, యీ యిన స్పెక్టరుగాడికి యీ తాలూకాకి వొచ్చింతరవాత అయిదారువేలు యిప్పించాను. వీధి తలుపు వేసుకొని సంగీత సాధకం చేసుకో, విద్యవంటి వస్తువు లేదు. (గుమ్మం దాటి నాలుగడుగులు వెళ్లి తిరిగి వచ్చి) అప్పుడే వీణ తీశావు? యీ వూళ్ళో మా దుర్మార్గులున్నారు; నా స్నేహితులవఁనీ, బంధువులవఁనీ పేరు పెట్టుకొస్తారు. రానీకుమా (తలుపు పైనించి వేసి) గడియ వేసుకో (నిష్క్రమించును) గురుజాడలు 254 కన్యాశుల్కము - మలికూర్పు