పుట:Gurujadalu.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కరట : చచ్చాడంటే వాడిదా తప్పు, మంచం మీంచి దించేయడానికి సిద్ధంగా వున్న వాడిక్కట్టావ్? గిరీశం: తమరేనా నులక అగ్నిహోత్రావుధాన్లు గారు? యీ పట్టెని జటలో తమంత వారు లేరని రాజమహేంద్రవరంలో మా వాళ్లనుకునేవారు. అగ్ని : మీది రాజమహేంద్రంషండీ. ఆ మాట చెప్పారు కారేం? రామావుధాన్లుగారు బాగున్నారా? గిరీశం: బాగున్నారండి. ఆయన మా మేనమావఁగారండి. అగ్ని : ఆ మాట చెప్పారు కారూ? గిరీశం : మా మావఁ ఈ దేశబ్బోగట్టా వొచ్చినప్పుడల్లా తమర్ని యెన్నిక చేస్తూంటారండి. అగ్ని : నాకూ వారికి చాలా స్నేహం. చూశారా కొంచం నాకు ప్రథమ కోపం. యవరో తెలియకుండా అన్న మాటలు, గణించకండేం. గిరీశం: దానికేవఁండి, తమవంటి పెద్దలు అనడం మాలాంటి కుఱ్ఱవాళ్లు పడడం విధాయకవేఁ గదండీ? కరట : (తనలో) యిన్నాళ్ళకి మా అగ్నిహోత్రుడికి తగిన వాడు దొరికాడు. అగ్ని : చూశారండీ, మీ పేరేవిఁటండీ? గిరీశం: గిరీశం అంటారండి. అగ్ని : చూశారండి, గిరీశంగారూ! మా కరటక శాస్త్రుల్లు వట్టి అవకతవక మనిషి; మంచీ చెడ్డా యేమీ వాడి మనసుకెక్కదు. అల్లుడు చచ్చిపోయినాడంటే అందువల్ల యెంత లాభం కలిగింది భూవుఁలకి దావా తెచ్చావాఁ లేదా? నేను యీ మధ్య దాఖల్చేయించిన పిటీషనుమీద ఆర్డరు చదివిపెట్టండి (గదిలోకి వెళ్లి కాకితం తెచ్చి గిరీశం చేతికి యిచ్చును) గిరీశం: (చూసి) ఎవడో తెలివితక్కువ గుమస్తా వ్రాసినట్టుంది. అక్షర పొలితే లేదండి. అగ్ని : మా వకీలు గడగడ చదివేశాడండి. గిరీశం: నేను మాత్రం చదవలేకనా, అంతకన్న గళగ్రాహిగా చదువుతాను. లెక్చర్లిచ్చే పండితుణ్ణి నాకిది పేలపిండీ కాదు; అయితే రాసినవాడి తెలివికి సంతోషిస్తున్నాను. యిది అరిటిపండు విప్పినట్టు తర్జుమా చేసి దాఖలు చెయ్యమని శలవా? అగ్ని : అంతకంటేనా! (తనలో) డబ్బు ఖర్చు లేకుండా వీడి చాత కాగితమ్ముక్కలన్నీ తర్జుమా చేయించేస్తాను. గురుజాడలు 234 కన్యాశుల్కము - మలికూర్పు