పుట:Gurujadalu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గురజాడ నేటి అవసరం

మహాకవి గురజాడ అప్పారావు జన్మించి 150 ఏళ్ళు. మరణించి ఇంచుమించు వంద ఏళ్లు. ఆయన మిగిల్చినవి దాదాపు పాతిక కవితలు, మూడు నాటకాలు, నాలుగున్నర కథలు, కొన్ని వ్యాసాలు, కొన్ని ఉత్తరాలు, కొన్ని ఏళ్ల దినచర్యలు వగైరా. తెలుగుజాతి వందేళ్లుగా వీటిని చదువుకుంటూనే ఉంది. వారి ఆలోచనా జీవితాన్ని గురజాడ సృజన ప్రభావితం చేస్తూనే ఉంది. ఇకపై కూడా ప్రభావితం చేస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ఆయన రాసినదానికన్న ఆయన మీద తెలుగుజాతి రాసుకున్నది చాలా ఎక్కువ. ఆ రాతలో గురజాడ రచనలలోని సూక్ష్మాంశాల వివరణ ఉంది. లోతయిన విశ్లేషణ ఉంది. పరిశోధన ఉంది. పరవశంతో కీర్తించడం ఉంది. వీటితోబాటు అభిశంసన కూడా హెచ్చుగానే ఉంది.

ఆ కీర్తనకైనా, అభిశంసనకైనా ప్రేరణ ఏమిటి? అది వ్యక్తమైన రూపాలు ఏమిటి?

మనం వాటినన్నింటినీ గుర్తించి ఒక పట్టీ వేయవచ్చు. అనేక విధాల విశ్లేషించ వచ్చు. అందులో తెలుగుజాతి ఉద్వేగాలను, ఆవేశకావేశాలనూ పోల్చుకోవచ్చు. వాటి నన్నింటినీ క్రోడీకరించి, ఒకే ఒక అంశాన్ని గుర్తించడానికి ప్రయత్నించితే నాకు కనిపించిందొక్కటే.

అది గురజాడ వారి నిలువు (stand). ఆ నిలువు ఏమిటి?

2

మహాకవులెవ్వరికైనా వారు జీవించిన కాలంలో, సమాజంతో అనివార్యమైన అసంతృప్తి ఉంటుంది. అసమ్మతి ఉంటుంది. దానిని వారు తమ రాతలతో పట్టుకోజూస్తారు. రూపం కట్టజూస్తారు. దానిని జనానికి చూపెట్టజూస్తారు. జనం మనసును ఆకట్టుకోజూస్తారు. వారి మస్తిష్కాలను పట్టజూస్తారు. ఆ అసంతృప్తి, సాహిత్యరూపంలో దాని ఆవిష్కరణ విశ్వమానవుడిని చూపించే క్రమానికి ఒక వెలుతురు ఇస్తుంది. స్థూల దృష్టితో చూస్తే మహాకవుల నిలువు ఒక్కటే అవుతుంది.