పుట:Gurujadalu.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లుబ్ధావ: (చేయి వణకుచుండ) యిదుగోనండి ఈ బంగీలో గుంటూరి శాస్త్రుల్ల పిల్లకి పెట్టిన కంటె.

నాయడు: (పై మాటలనుచుండగ గడపమీద నడుగుబెట్టి నిలిచియుండి) ఆఁ పంతులుగారూ! అది మధురవాణిదండి, దాని తరుపున వకాల్తీ నేనుపట్టాను. (లుబ్ధావధాన్లుగారి వైపు చూచి) యేమండీ లుబ్ధావధాన్లుగారూ! యీ కంటె మధురవాణిది కాదూ?

లుబ్ధావ: రామప్పంతులు అలాగే అంటూవచ్చేవాడు.

సౌజన్య: అది యెవరిదైతే వారికి యిప్పించేస్తాను.

నాయడు: తమరు మరి వకలా చేస్తారని కాదు. తెలిసిన హంశంగనక మనవి చేశాను. అగ్నిహోత్రావధాన్లుగారి కొమార్తెను ఎత్తుకు పోయిన గిరీశం తమ బసలో జొరబడ్డాడని ఆయన... చూసి కనుకొమ్మన్నారు, దొరికాడా యేమిటండీ?

సౌజన్య: మీరు మాటాడక ఊరుకోండి. యితనూ, అతనూ కలిస్తే రక్తఖల్లీలైపోతాయి. (గిరీశంతో) యిప్పుడు నాలుగు గంటలపావు అయినది. ఆరు గంటలకు స్టీమరు వెళ్లిపోతుంది. యవరోయి బంట్రోతు! బగిగి, పెరటి గుమ్మమువైపు తీసుకురా (గిరీశంతో) నీవు యీ నిముషము బయలుదేరి స్టీమరు అందుకుని, రాజమహేంద్రవరము వెళ్లిపో, నీ యోగ్యత నాకు యిదివరకే తెలిసి వీరయ్యపంతులుగారికి తెలియజేసినాను. బుచ్చమ్మను నీవు యిప్పుడు పెళ్లాడడముకు వల్లలేదు. ఆ పిల్లను రామబాయిగారి వీడోస్‌హోముకు పంపించి విద్య చెప్పించ వలసినదని వీరయ్య పంతులుగారి పేర వ్రాసినాను. నీవంటివాళ్లు చేరితే రిఫారం పరువుపోతుంది. నీవు తిరిగీ కాలేజీలో ప్రవేసించి యీ వికారపు చేష్టలు వదిలి, బియ్యేవరకూ చదువుకుంటే ఆపైని బుచ్చమ్మకు యిష్టంవుంటె నిన్ను పెళ్ళాడుతుంది. నీచదువు విషయమయి వీరయ్య పంతులుగారు ఫండులోనుంచి సహాయము చేస్తారు. నీవు తిన్నగా తిరగకపోతే ఆ సహాయంకూడా చెయ్యరు. (బంట్రౌతు ప్రవేసించి బగ్గీ సిద్ధంగా వున్నది అని చెప్పును) పో, పోయి బుద్ధిగా బతుకు, వకనిముషం ఆగావంటే, అగ్నిహోత్రావధాన్లు నీ పెంకితనం అణగకొడుతాడు.

గిరీశం : (మాటలువినినంతసేపును, నిర్ఘాంతపోయి చూచుచు, మాటలు కాగానే ముఖం ప్రక్కకు త్రిప్పి) డామిట్! వ్యవహారం అడ్డంగా తిరిగింది.

(తెర దించవలెను)

గురుజాడలు

209

కన్యాశుల్కము - తొలికూర్పు