పుట:Gurujadalu.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాల్గవ స్థలము - సౌజన్యరావుపంతులుగారి యింటినడవ

(లుబ్ధావధాన్లు, గిరీశం ప్రవేశించుచున్నారు)

గిరీశ : దొరికిపోయినాడుకాని అగ్నిహోత్రావధాన్లు అడ్డుపడ్డాడు. వొహరికిద్దరైనారు గదా అని వెళిపోవచ్చాను.

లుబ్ధావ: గుంటూరిశాస్త్రుల్లు వాడేనా.

గిరీశ : వాడెక్కడ గుంటూరిశాస్త్రుల్లు. ఆయన అగ్నిహోత్రావధాన్లు బావమరిది కరటక శాస్త్రుల్లు.

(సౌజన్యరావు పంతులుగారు ప్రవేశించుదురు)

సౌజన్య: యేమిటండోయ్ విశేషాలు?

లుబ్ధావ: గుంటూరిశాస్త్రుల్లు కనపడ్డాడండి. ఇదుగో యిప్పుడే.

గిరీశ : కాడండి, అతను అగ్నిహోత్రావధాన్లు బావమరిది కరటకశాస్త్రుల్లండి.

సౌజన్య: (ఆశ్చర్యము నభినయించుచు) సొంస్కృతనాటకంలో విదూషకుడు, మన కరటక శాస్త్రుల్లా యేమిటి?

గిరీశ : అవునండి.

లుబ్ధావ: కాడు, కాడు, నా కళ్ళారా చూశాను. అతనే గుంటూరి శాస్త్రుల్లు, నన్ను చూస్తూనే పరుగుచ్చుకున్నాడు.

గిరీశ : చాలాదూరం వెంట దరిమాను కాని దొరికాడుకాడు.

సౌజన్య: అలాగనా; నిన్నే అగ్నిహోత్రావధాన్లు వీధికొసని కడుపీడ్చుకుంటూ వెంటతరమడం మేడమీంచి చూశానే.

గిరీశ : (తెల్లపోయి చూచును)

సౌజన్యా: మళ్లీ కళ్లెదటపడి దొరికినట్టైనా నీ యెముకలు విరక్కొట్టేస్తాడు.

లుబ్ధావ: (మణీఆర్డరు కాగితము సౌజన్యరావు పంతులుగారికి చూపించి) యిదిగోనండి గుంటూరి శాస్త్రుల్లు దగ్గిర్నుంచి పన్నెండువందల్రూపాయిలకు మణీఆర్డరు వచ్చింది. ఈ వూర్నుంచేనట.

సౌజన్య: పన్నెండు వందలేనా మీ దగ్గర అతను పుచ్చుకున్నవి?

లుబ్ధావ: అవునండి.

సౌజన్య: అతని కుమార్తెకు పెళ్లికాలేదే? ఐసీ ఇట్ ఆల్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ హార్లకివ్‌స్ ప్రాక్టికల్ జోక్‌స్. మీ వివాహం నిజమయిన వివాహం కాదు మీరు భయపడకండి.

గురుజాడలు

208

కన్యాశుల్కము - తొలికూర్పు