పుట:Gurujadalu.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(అగ్నిహోత్రావధాన్లు, నాయడు, మాటలాడుచుందురు)

అగ్నిహో :అయితే కేసు మానుకొమ్మన్నారూ?

నాయడు: లేకపోతే మీకు చాలా వుపద్రం సంభవిస్తుంది. ఆ యింగ్లీషు వకీలు అంతా పాడుచేశాడు.

అగ్నిహో : అయితే రామప్పంతులు వూడాయించేసి నట్టేనా?

నాయడు: అందుకు సందేహం యేమిటి?

అగ్నిహో : నాకడియం. మరో బంగారపు సరుకూ తాకట్టు పెడతాననీ తీసుకుపోయినాడు.

నాయడు: వాటికి నీళ్లధారే.

అగ్నిహో : అయ్యో! కడియం మా తాతగారినాటిది, మీరు మొన్న దొడ్డీతోవంబడవస్తున్నారే, ఆ సానింట్లోతాకట్టు పెట్టానన్నాడు.

నాయడు: రామ, రామా, దాని దగ్గిర యంతమాత్రం లేదు. మీది మిక్కిలి దాన్తాలూక్కంటోటి వాడే తీసుకుపోయి యెక్కడో తాకట్టు పెట్టేశాడు, గానీ మీమీద ఫోర్జరీకేసు ఖణాయించకుండా డిఫ్టీ కలక్టరుగారితో సిఫార్సు చేశాను గదా నాకేమిస్తారు?

అగ్నిహో : యేమిచ్చేది, నాభి కొనుక్కోడానికి దమ్మిడీ అయినా యిప్పుడు లేదు. వూరికి చేరితేనేకాని డబ్బురాదు.

నాయడు: పోనియ్యండి. ఒక ప్రోమిసరీనోటు రాయండి రూపాయిలు యిప్పిస్తాను.

అగ్నిహో : పీకపోయినా అప్పుచేయ్యను. మా తండ్రి చచ్చిపొయ్యేటప్పుడు రుణం చెయ్యనని ప్రమాణం చేయించుకున్నాడు.

(తెరవెనుక నుంచి పట్టుకో, పట్టుకో దొంగ యనునొక కేక వినబడును) (కరటకశాస్త్రులు వగర్చుచు పరుగెత్తుకొని వచ్చును)

అగ్నిహో : ఇదుగో బావా యిదేమిటోయ్!

కరటక: ఊరుకో, ఊరుకో, నేనిక్కడున్నానని చెప్పకు.

(అని పరదామూల దాగును. రెండవ వైపునుంచీ వగర్చుచు గిరీశం వచ్చును)

అగ్నిహో : (గిరీశంను జూచి) ఇదుగో గాడిదెకొడుకు దొరికాడు, (అని మీద బడబోగా గిరీశం గతక్కుమని వెనుకకు మళ్లి పారిపోవును. అగ్నిహోత్రావధాన్లు వెంట దరుమును)

నాయడు: యేమిటీ గమ్మత్తు! యేమిటీ అద్భుతం! యిదీ అరబ్బీనైట్సులో చిత్రం లావుంది, దీని గమ్మత్తేదో మనంకూడా కనుక్కుందాం. (వెళ్లును)

గురుజాడలు

207

కన్యాశుల్కము - తొలికూర్పు