పుట:Gurujadalu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రంగారావు గారు కొన్ని సవరణలు సూచించారు. ఏ పుస్తకం కావాలన్నా కాకితో కబురుచేస్తే క్షణాల్లో పంపించారు శ్రీ లంకా సూర్యనారాయణ గారు (గుంటూరు). ఆచార్య మొదలి నాగభూషణశర్మ గారు, డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ గారు, డాక్టర్ కడియాల రామమోహనరాయ్‌గారు అవసరమైన సమాచారం, సూచనలు అందించారు. నాపోరు తట్టుకోలేక శ్రీ చలసాని ప్రసాద్ గారు తన వద్ద ఉన్న గురజాడ పత్రాల సూట్ కేస్‌లు పెన్నేపల్లి గోపాలకృష్ణకు పంపించారు, “మహాకవి గురజాడ అప్పారావుగారి గేయములు” (వావిళ్ళ వారి ప్రచురణ, 1950) జెరాక్సు చేసుకోడానికి అంగీకరించారు. శ్రీశాసపు రామినాయుడుగారు (వెలుగు, రాజాం) నీలగిరి పాటలు కాపీ పంపించారు. డాక్టర్ పోరంకి దక్షిణామూర్తిగారు, డాక్టర్ అక్కిరాజు రమాపతిరావుగారు, ఇతర మిత్రులు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. బాపు ఈ సంపుటాన్ని ముఖచిత్రంతో అలంకరించారు.

కన్యాశుల్కం 1909 ప్రతి మనదేశంలో ఎక్కడా లభించలేదు. శ్రీ ఎం.వి. రాయుడుగారి కుమారులు చిరంజీవి ‘జెన్' ఇంగ్లాండు నుంచి ఈ పుస్తకం డిజిటల్ కాపీ పంపి సహకరించారు. శ్రీ ఎం.వి. రాయుడుగారు మనసు ట్రస్టు అధిపతులుగా, ఈ సంపుటం సహ సంపాదకులుగా మాకు సంపూర్ణ సహకారం అందించారు. ఎప్పుడు, ఏ సమాచారం అవసరమైనా క్షణాల్లో పంపించారు.

ఈ 'గురుజాడలు' సమగ్ర రచనల సంపుటాన్ని తయారు చెయ్యడానికి రెండు సంవత్సరాల పైనే పట్టింది. అన్ని అడ్డంకులు అధిగమించి, మనసు ట్రస్టువారు గురజాడ 150వ జయంతి రోజు ఈ సంపుటాన్ని విడుదల చెయ్యడం ఆనందించదగిన సంగతి. మా కృషిలో లోపాలు లేవని అనుకోడం లేదు. అయితే గురజాడ రచనలన్నీ ఒకేచోట, ఒక సంపుటంగా తీసుకొని రావడంలో ఒక అడుగు ముందుకు వేశామని మాత్రమే వినయంగా విన్నవించుకొంటూ సెలవు తీసుకొంటున్నాము.

9.9.2012,
నెల్లూరు.

- డాక్టర్ కాళిదాసు పురుషోత్తం

(సంపాదకవర్గం పక్షాన)