పుట:Gurujadalu.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అగ్నిహో: దుర్మతి.

కలెక్టర్: జాతకంలో దుందుభుందే. రెండు దస్తూరీలు వొక్కలాగున్నా యేమయ్యా బ్రాహ్మడా? బ్రాహ్మణ్యం పరువంతా తీసేస్తిరే. గడ్డితిని పిల్లనమ్ముకున్నావు సరేకాని, యీలాటి ఫోర్జరీలు కూడా చేయిస్తావూ, బ్రాహ్మల్లో అంత, ఖంగాళీ మాలకూడు మరెక్కడాలేదు. నీ దుర్మార్గతవల్ల నీ కుమార్తెను యీ అవస్థలోకి తెచ్చి మళ్లీ ఎబ్‌డక్‌షన్ కేసుకూడానా? నీ పొట్ట కరిగించేస్తానుండు. (గుమాస్తాతో) కేస్‌లో నోటీస్‌లు చెయ్యి.

గుమా: (చార్జీ కాగితముజూచి) యిందులో ముద్దాయీ యింటిపేరూ సాకీనూ లేదండి.

నాయ: (లేచి) వల్లకాట్లో రామనాధయ్య వ్యవహారంలాగుంది. ఇంగ్లీషు వకీళ్లు దాఖలు చేసే కాకితాలు యీరీతినే వుంటాయండి.

భీమా : (గుమాస్తాతో రహస్యముగా) తరవాయీలు నింపించలేదుటయ్యా (పైకి) యీలా నాయుడుగారు నన్ను తూలనాడుతుంటే కోర్టువారు ఊరుకోడం న్యాయంకాదు.

కలెక్టర్: నాయడుగారు మిమ్ము నేమి అన్లేదే.

భీమా : (తనలో) యిక్కడికి నేను రావడం బుద్ధిపొరపాటు.

క్లర్క్ : (భీమారావు పంతులుగారితో) ఇంటిపేరూ, సాకీనూ యేమిటండీ?

భీమా : (అగ్నిహోత్రావధానులుగారితో) ఏమిటయ్యా?

అగ్నిహో : ఆయనపేరు గిరీశం, మరంతకంట నాకు తెలియదు.

కలెక్టర్ : చాబాష్ : బాగావుంది! అవధాన్లుగారి కొమార్తెని యెవడో తీసుకుపోయినాడు. కనక వాడి వూరూ పేరూ యెరిగినవాళ్లు తెలియచెయ్యవలసినదని దండోరా కొట్టించి గేజట్లో వేయించండి. పోలీసువారికి యెందుకు నోటీసివ్వలేదూ! సాకీనూ మొదలైనవి లేనిది కేసు యడ్‌మిట్‌చేయడానికి వీలులేదు. టిఫిన్‌కి వేళయింది లేదాము (అని లేచి వెళ్లిపోవును)

అగ్నిహో: (భీమారావు పంతులుగారితో) ఏమండోయ్ కేసు అడ్డంగా తిరిగిందే (భీమారావు పంతులుగారు మాట్లాడరు)

అగ్నిహో: యేమండోయి మీతోటి మాట్లాడుతున్నాను.

భీమా : ఇచ్చిన ఫీజుకు పనైపోయింది. మళ్ళీ ఫీజిస్తేనే కాని మాట్లాడేది లేదు.

అగ్ని : యేం పనైంది అఘోరంపని, కలక్టరు చివాట్లు పెడుతూంటే ముంగిలా మాట్లాడక వూరుకున్నారు.

భీమా: బంట్రోత్! యితన్ని నా దగ్గరకి రాకుండా గెంటేయ్.

గురుజాడలు

202

కన్యాశుల్కము - తొలికూర్పు