పుట:Gurujadalu.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలెక్టర్: (భీమారావువైపు జూచి) పిల్లకు పదహారు సంవత్సరములకులోపు యీడని రుజు వున్నదా?

భీమా : జాతకం వుందండి.

నాయడు : కోర్టువారు ఆ జాతకం దాఖలు చేసుకోవాలి

భీమా : యీ కేసులో ఆయన మాట్లాడుతుంటే నే ఎంతమాత్రం వొప్పేదిలేదు.

నాయడు: యీ కేసులో నాక్కూడా వకాల్తినామా వుందండి (అని దాఖలుచయును)

భీమా : (అగ్నిహోత్రావధాన్లుగారితో) ఏమయ్యా యీయనక్కూడా వకాల్తీ యిచ్చావయ్యా?

అగ్నిహో: మొదటా, రామప్పంతులు యీయన కిప్పించారు.

భీమా: (అగ్నిహోత్రావధాన్లుగానితో) అయితే యేడువు.

(అగ్నిహోత్రావధాన్లు తెల్లపోయి చూచును)

కలెక్టర్ : యేదీ జాతకం దాఖలు చెయ్యండీ.

(భీమారావు పంతులు దాఖలు చేయును)

నాయడు: కోర్టువారితో వకసంగతి మనవి చేసుకుంటాను. యీజాతకం విశ్వామిత్రుడంత యోగ్యుడైన బ్రాహ్మడిచేత తయారుచెయ్య బడ్డది. అదుగో ఆమూల నిలబడ్డ రామప్పంతులుగారికి యీ జాతకంలో మంచి ప్రవేశం వుందండి.

భీమా: నేను పేస్‌డ్ వకీల్ని కేసు హీరింగు నేనే చేయవలెనుగాని నాయుడుగారు చేస్తే నేనెంత మాత్రం వొప్పేదిలేదు.

నాయుడు: స్మాలెట్ దొరగారి దగ్గిర్నుంచీ యేజన్సీ కోర్టులో వకాల్తీ చేస్తున్నాను. డబ్బుచ్చుకున్నందుకు నా పార్టీ తరపున నాలుగుమాటలు చెప్పితీరుతానుగాని యింగ్లీష్ చదువుకున్న కొందర్లాగ నోటంట మాట్రాకుండా కొయ్యలాగ నిలబడనండి.

కలెక్టర్: క్లార్క్ ఆ రామప్పంతులుచాతను దీనిక్కాపీ రాయించు.

(క్లార్క్ వ్రాయించును)

(అతను కాపీవ్రాయులోగా డెప్యూటీ కలెక్టర్, గుమాస్తాలు తెచ్చిన కొన్ని కాగితముల మీద సంతకములు చేయుచుండును. కొంతసేపునకు గుమాస్తా రామప్పంతులు వ్రాసిన కాపీతోకూడా జాతకమును దాఖలు చేయును)

కలెక్టర్ : (అగ్నిహోత్రావధానులవైపుచూచి) మీ కొమార్తె, యే సంవత్సరమందు బుట్టిందయ్యా?

గురుజాడలు

201

కన్యాశుల్కము - తొలికూర్పు