పుట:Gurujadalu.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(సౌజన్యారావుగారి యిల్లు.)

(సౌజన్యారావు పంతులుగారు, అగ్నిహోత్రావధానులు కూరుచొని మాటలాడుచుందురు)

సౌజన్య: ఇహ మిమ్మల్ని జయించినవాడు లేడు. పిల్లల్నమ్ముకోవడం శిష్టాచారం అంటారయ్యా?

అగ్నిహో : ఔనండి మా మేనత్తల్నందర్ని అమ్మేరు. వాళ్లంతా పునిస్త్రీ చావేచచ్చారు. మా తండ్రి మేనత్తల్నికూడా అమ్మడమే జరిగిందష, యిప్పుడీ వెధవ యింగ్లీష్ చదువునుంచి ఆ పకీరు వెధవదాన్నీ లేవదీసుకు వెళ్లిపోయినాడు గాని, వైధవ్యం అనుభవించిన వాళ్లంతా యెంత ప్రతిష్టగా ప్రతీకారు పూర్వకాలంలో.

సౌజన్య : చిన్నపిల్లల్ని కాలంగడిచినవాడికి చేస్తే వైధవ్యం రాక మానుతుందయ్యా?

అగ్నిహో : ప్రాలుద్ధం చాలకపోతే ప్రతివాళ్లకీ వస్తుంది. చిన్నవాళ్లకిస్తే నేమి పెద్దవాళ్లకిస్తేనేమి, రాసిన రాతేవడైనా తప్పించగలడూ?

సౌజన్య : డబ్బుకి లోభపడిగదా ముసలివాళ్లకిస్తారు. కన్యలమ్ముకోవడం శాస్త్ర దూష్యం కాదయ్యా?

అగ్నిహో : యిప్పుడు మీ లౌక్యుల్లో రెండేసి వేలూ, మూడేసి వేలూ, వరకట్టాలు పుచ్చుకుంటున్నారు కారండీ. మామట్టుకేనా శాస్త్రాలు?

సౌజన్య: చంటిపిల్లని ముసలివాడికి యేం సౌఖ్యపడుతుందని యిచ్చారయ్యా?

అగ్నిహో : అదంతా మీకెందుకయ్యా. ఓహో! యిందుకా నన్ను పిలిపించారు. వెధవముండన్లేవదీసుకు పోయిన పకీర్ వెధవపక్షాన మాట్లాడతారూ? యేం పెద్ద మనుష్యులండీ, కేసునుకునేది లేదు సరేగదా ఆ వెధవ, కనపడితే నా దుఃఖంతీరా నూటేస్తాను.

సౌజన్య: తొందరపడకండీ అవుధాన్లుగారూ, బ్రాహ్మణోత్తములు, తమ దగ్గిరంతా శాంతం నేర్చుకోవాలి. లుబ్ధావధాన్లుని నూటేసినందుకు సిక్ష కావడానికి సిద్దంగా వుందిగదా. వందో రెండువందలో యీసరికి వదిలిపోయినాయి. కాళ్లు బాగా పీకితేనేకాని కన్యా శుల్కంలోవున్న దోషమూ కనపడదు, మీ మూలంగా దురవస్థచెందిన మీ పిల్లయందు మీకు కనికరమూ పుట్టదు. నాపేర రిఫార్‌మ్ సభ శక్రటరీగారు వుత్తరం వ్రాశారు. ఆ పిల్లతాలూకు ఆస్తి కొంత మీవద్ద వుందట; చిక్కులలో దిగక పంపించెయ్యండి.

అగ్నిహో : నా పిల్లేమిటి పకీర్ ముండ. రేపు యింటికి వెళుతూనే ఘటాశార్ధం పెట్టేస్తాను.

సౌజన్య : ఇంత కనికరం లేదేమయ్యా నీకు?

అగ్నిహో : ఏమిటో నా ప్రాలుద్ధం మీ కెందుకూ? మీ గృహకృత్యాలవూసుకు నే వచ్చానా?

గురుజాడలు

195

కన్యాశుల్కము - తొలికూర్పు