పుట:Gurujadalu.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామప్ప: రామరామా! యెంత మాటంటావయ్యా. మీరు ఆపదలోవుండి విరక్తిచాత యేమాటలన్నా మేము మీవిషయంలో పనిచేయడం మాకు విధి. ముందూ వెనకా చూడ్డానికి యిహటైమ్ లేదు. వ్యవహారం అంతా ఫొక్తు పర్చుకువచ్చాను. పదివేలక్కర్లేదు. అయిదు వేలిచ్చినట్టైనా యినస్పెక్టరుగారు బలమైన డిఫెన్సు సాక్ష్యంకూడా కుదిర్చి పెడతారు. కేసు యెండ ముందర మంచు విడిపోయినట్టు విడిపోతుంది. ఒక చోట వ్యవహారం కూడా కుదిర్చాను. ప్రామిసరీ నోట్ రాసినట్టైనా రూపాయిలిస్తారు.

లుబ్ధావ: వకదమ్మిడీ నేనివ్వను - రామనామతారకం -

రామప్ప: చెడిపోక నామాటవిను, యంతో ప్రయాస మీద యీ ఘట్టం కుద ర్చాను. యినస్పెక్టరు, తాప్సీలార్ని సాధించడంకోసం యీ కేసంతా లేవదీశాడు. యిందులో సిక్షైపోయినట్టైనా తాస్సీల్దారు తాడుతెగుతుంది. డిప్టికలక్టరు బ్రహ్మద్వేషి: గట్టిడిఫెన్సొ స్తేనేకానీ కమ్మెంటు కట్టేస్తాడు. యినస్పెక్టరు యింత పట్టుదలగా వున్నా నాకూ అతనికీ వుండే స్నేహంచాత యీ ఘట్టానికి వొప్పుకున్నాడు. యిటు పైని జాలం అయితే నీ కూతురికి వురి నీకు కఠిన సిక్షాపడిపోతుంది.

లుబ్ధావ: పడితే పడ్నీ నాదగ్గర డబ్బులేదు. నన్ను బాధపెట్టక నీ మానాన్న నీవు పోదూ రామనామతారకం -

రామప్ప: నీ అంత కర్కోటకుణ్ణి నేనెక్కడా చూడలేదు. కన్నకడుపు కూతురు జైల్లో కూర్చుని వురికి సిద్ధంగా వుంటే వెధవడబ్బుకి ముందూ వెనకా చూస్తున్నావు.

లుబ్ధావ: నన్నెందుకు బాధపెడతావు పదివేల నమస్కారాలు వెళిపో బాబూ-రామనామతారకం -

రామప్ప. ఐతే నీకు సిక్షకావడం, నీ కొమార్తెను వురితియ్యడం నిశ్చయం. నాకు హృదయం కరిగిపోతుంది. దేవుడా యేమిటిగతి. (అని కళ్లను వోణీ అద్దుకొనును)

(లుబ్ధావధాన్లు గదిలోనికి వెళ్లి తలుపు వేసుకొనును)

(సౌజన్యారావు పంతులుగారు ప్రవేశించుచున్నారు)

రామప్ప: తమరు ధర్మస్వరూపులు, లుబ్ధావధాన్లు గారియందు దయచాత యీ కేసులో పనిచేస్తున్నారు. కేసంతా వట్టి అన్యాయం. యేమీ నిజంలేదు. సెలవైతే డిఫెన్సు సాక్ష్యం కుదురుస్తాను.

సౌజన్య: నీ సంగతి నాకు తెలుసు. యిక్కడ్నుంచి లేచివెళ్లిపో.

రామప్ప: (తనలో) వీడసాధ్యుడ్లావున్నాడు. వీడి చర్య చిత్రంగా వుంది. డబ్బుయేడుపేమీ అక్కర్లేదు. ఎప్పుడూ న్యాయం న్యాయం అంటూ దేవులాడుతాడు. (అని నిష్క్రమించుచున్నాడు).

గురుజాడలు

193

కన్యాశుల్కము - తొలికూర్పు