పుట:Gurujadalu.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవస్థలం- (లుబ్ధావధానులు ఇల్లు)

(లుబ్ధావధానులు, రామప్పంతులు ప్రవేశించుచున్నారు. )

రామప్ప: అయితే కంటె ఇవ్వనంటావా?

లుబ్ధావ: నీకంటె సంగతి నాకేమీ తెలియదు.

రామప్ప. అయితే నీమీద క్రిమినల్ చార్జీ తేవలసి వుంటుంది.

లుబ్ధావ: పీకకోసినాగానీ కంటెమాట నాకేమీ తెలియదు.

రామప్ప: యింతా చదువుకుని అబద్ధం ఆడేస్తావయ్యా,

లుబావ: అక్షరాలా.

రామప్ప: నీకూ నాకూ వుండే స్నేహం ఇంతేనా నా మాటవిని కంటెఇచ్చేయి మధురవాణి దానికోసం అల్లరి పెట్టేస్తూన్నది.

లుబ్ధావ: యీ కబుర్లు నాతో యెందుకు చెపుతారు? ససేమిరా కంటె సంగతి నాతో మాట్లాడవద్దు.నీ స్నేహంవల్ల కావలసిన వుపకారం ఎంత కావాలో అంతా అయింది. వద్దంటూ వుంటే పెళ్లాడమని ప్రాణాలు తినేశావు. డబ్బు పోవడం పెళ్లాము పారిపోయి పరువు పోవడం ఆలాగు వుండగా మీది మిక్కిలి కూనీకేసుకూడా పీకలమీదికి తెచ్చావు. నాపాలింటి శనిగ్రహంనీవే. అందుకు తోడు యేల్నాటిశని రోజులు కూడా తటస్థించాయి? రేపు రాత్రి బయలుదేరి కాశీయాత్ర వెళ్లడానికి నిశ్చయించాను. పెట్టవలసిన బాధేమో పెట్టావు. చెయ్యి చిక్కిన డబ్బేమో చెయ్యి చిక్కింది. మరి కంటే గింటే అని బాధపెట్టక లేచిపోతే బహువుపకారంగా ఆలోచించుకుంటాను.

రామప్ప: మొగుణ్ణి కొట్టి మొగసాలెక్కింది అన్న సామెతగా, నువ్వూ ఆగుంటూరు శాస్త్రులూ కలిశిచేసిన దగావల్ల యాభై రూపాయీలూ, కంటే, పోవడమే కాకుండా నేను పెళ్లిలో పడ్డశ్రమ యెంతమాత్రమూ ఆలోచించినావు కావు! చిన్నప్పటినుంచీ నీ దగ్గిర యెంతో స్నేహభావంగా వుండే నన్ను యీలాగు దగా చెయ్యడం యెంతమాత్రమూ నీకు న్యాయముకాదు. కేసులో నా వూసే ముందీ. కూనీ జరిగిన తరువాత పోలీసు వాళ్లూరు కుంటారా? బలవత్తరమయిన సాక్ష్యం వచ్చింది. నన్నేమి చెయ్యమంటావు? ఇంకా నేను చెప్పబట్టే నిన్నీలాగు వదిలేశారు. న్యాయమాలోంచి నాకంటె నాకిప్పించండి.

లుబ్ధావ: యెవరివల్ల వస్తేనేమీ నా ప్రాలుద్దం ఆలాగువుంది యేలాగా రేపు బయలు దేరి వెళ్ళిపోవడానికి సిద్ధంగా వున్నాను. మీకంటె సంగతి మీరే కొవ్వి తెచ్చిపెట్టుకున్నారు - నన్ను ఆ విషయమై అడగవలసిన ప్రసక్తిలేదు.

గురుజాడలు

184

కన్యాశుల్కము - తొలికూర్పు