పుట:Gurujadalu.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామప్ప: గాడిదలు యెవరూ వినిపించుకోకుండా వున్నారు. (అని గట్టిగా) హెడ్డు గారూ కూనీ, కూనీ జరిగింది.

హేడ్ : యెవరో కూనీ, కూనీ అంటున్నారు.

రామప్ప: లుబ్ధావధానులు భార్యను చంపివేశినాడు. నూతిలో ధభీమనీ పడివేయడం నేను చూచినాను, ఆ తరువాత శవంతీసి పాతిపెట్టి వేసినాడు.

హేడ్ : (తలుపు తీసికొని యవులకువెళ్లి) యెందుకు చంపాడేమిటి.

రామప్ప: పెళ్లయిన మూడు రోజుల్లోగా రెండు వందలు రూపాయలు ఖర్చు పెట్టిందట. యింతే కాకుండా యిdi వుండడం మీనాక్షి వ్యాపారానికి భంగం; యీ గుంట దానిగుట్టు వీధిలో పెట్టినది.

హేడ్ : యేదో ఆలాగచెప్పు అదీ వుంటేగానీ కూనీయెప్పుడూ జరగదు. యిన్నాళ్లకు దొరికాడవుధాన్లు, నా రెండు వందలరూపాయల పత్రం లాగేస్తాను.

రామప్ప. అయితే నీమట్టుకేనా? భాయీ! నాకంటె అపహరించాడు. దాని ఖరీదు కూడా తియ్యాలి సుమా.

హేడ్ : అదంతా నువ్వే సెటిలుచేసుకో - గాని వక్కడి సాక్ష్యం చాలదే.

దుకాణ: నాకేమైనా పారేస్తే నేను సాచ్చికం పలుకుతాను.

హేడ్ : మూడోసాక్షికూడా కావాలే

బైరాగి : కావలిస్తే నేను కూడా వస్తాను, మావంటి జ్ఞానులుకు అబద్ధం అన్నమాటలేదు, లోకం అంతా మిధ్య, నువ్వూ నేనూ కూడా అబద్దమే. దాని రహస్యం అది. ఏమయినా డబ్ళు పారవేస్తే హరిద్వారంలో నేకడుతూన్న మఠానకు పనికివస్తుంది.

హేడ్ : అచ్చన్నగారుకూడా వస్తే బాగుండును గాని, ఆయన సమాధిలో వున్నాడు.

దుకాణా: మనము చాలమా యేమిటి, ఆయన రేపు సండేళకిగాని సమాదీలోంచి లేవడు.

(అంతా వెళ్లిపోనిచ్చి దుకాణాదారుడును. పంతులును వెనుక నాగుదురు. పంతు లెవరును లేకుండ నిటునటు చూచి యొకగ్లాసు పుచ్చుకొనును)

దుకాణా: మీ పద్దు పాతిక రూపాయలయిందండి. అందర్లాగా మిమ్మల్నింటికొచ్చి అడగడానికి ఒల్లలేదుగదా?

రామప్ప: ఈ వ్యవహారంలో యేమయినా చెయ్యితడి అవుతుంది. నీపద్దు మొట్టమొదట పయిసలు చేస్తాను. (అని నిష్క్రమించును)

గురుజాడలు

178

కన్యాశుల్కము - తొలికూర్పు