పుట:Gurujadalu.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దుకాణ: (నలుగురివైపు జూచి) సూశారా భాయి నే మొదట్నించీ యిదేకదా సెపుతూ ఒచ్చేవోణ్ణి - అఖాడాకొస్తేగాని పరబ్బరమం దొరకదు

బైరాగి : కాసీలో మేమూ వక బ్రాహ్మడు బ్రహ్మగ్యాన సమాధికి కూర్చున్నాము. బుడ్డీమీద బుడ్డి, బుడ్డీమీద బుడ్డి తెల్లవారేటప్పటికి యిద్దరికీ తన్మయం అయిపోయింది. మరి రెండు రోజులకుగాని నేను సమాధిలోంచి లేవలేదు. మరి ఆ బ్రాహ్మడు, యెప్పటికీ లేవలేదు. పరమాత్మలోకలిసి పోయినాడు. (పెన్షను సిపాయి అచ్చన్న ప్రవేశించుచున్నాడు)

దుకాణ: ఈయన సిపాయి అచ్చన్నగారు మంచి బరమగ్గాని.

అచ్చన్న: నేను యేహపాటివాడనండీ, మీ ద్రాసుడను, తమవంటివారు వచ్చినప్పుడల్లా పాదసేవ చేసుకుని నాలుగు స్రంఘతులు నేర్చు కున్నాను.

బైరాగి : నీ ముఖాన్ని మంచి బ్రహ్మకళవున్నదిరా నరుడా.

అచ్చన్న: (దుకాణదారుతో) నాహస్రంగతి యిప్పుడు త్రెలిసింధా (పైకి) తమ కటాక్షం.

హేడ్ : అచ్చన్నగారు మా బాగాపాడుతారండీ.

బైరాగి : యేదీ కొంచెము పాడూ.

దుకాణ: ఒక గళాపుచ్చుకు మరీ పాడండి.

అచ్చన్న: (యాగంటి లింగడిపాట పాడి, పాటయిన తరువాత మరి రెండు గ్లాసులు పుచ్చుకొని) మాఘురువుగాహరు యీ క్రీర్తన ప్రాఢుతూ రెండు హడుగులుపైకి లేచేవారు.

బైరాగి : నాశక్తి చూపిస్తాను చూడండి. నరుడా ఆ సీసా యిలాగందుకో మంత్రిస్తాను, వకొక్క గలాసు పుచ్చుకుని కళ్లు మూసుకుని లోపలిదృష్టితో చూడండి. నేను లంబికా యోగం పడతాను.

(అందరును త్రాగి కళ్లుమూసికొనుదురు.)

బైరాగి : కళ్లు మూసుకున్నారా?

అందరు:మూసుకున్నాము గురోజీ.

బైరాగి : బస్ - యికకళ్లు తెరవండి, యెన్ని అడుగులు పైకిలేచానో చూశారా?

అచ్చన్న: యీవేహళ యేమిసుధినం! మరి వక్క క్రీహర్తన మనవిచేసుకుంటాను.

(అని మరి వకగ్లాసు పుచ్చుకొనును. )

బైరాగి : యితను నిజంగా బ్రహ్మగ్యానిలాగ కనబడుతున్నాడు.

(వీధిలోనుంచి రామప్పంతులు తలుపు, తలుపు అనీ యనేకమారులు విలుచును. ఎవరును పలుకరు. )

గురుజాడలు

177

కన్యాశుల్కము - తొలికూర్పు