పుట:Gurujadalu.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెంకటే: నారింజపండు.

గిరీశ : వెరీగుడ్ - అందుకు అమర నీఘంటులో పద్యం నీకు వచ్చునా?

వెంకటే: రాదు - చెప్పండి రాసుకుంటాను.

గిరీశ : యింతలు బదరీ ఫలములు యింతలు మారేడుబళ్లు యీడుకుజోడై బంతులు తామర మొగ్గలు దంతీకుచ కుంభములభోలు తరుణీకుచములూ.

యీ ప్రపంచములో యేమి వస్తువు లుంటవి?

వెంకటే: ఆవులు,

గిరీశ : డామ్ నాన్సెన్స్ - యెంతసేపూ ఆవులే? యేమిటి వుంటవి?

వెంకటే: గేదెలు

గిరీశ : దట్ విల్ నాట్ డు - ఆలోచించి చెప్పు

వెంకటే: అయితే నాకు తెలియదు.

గిరీశ : వీడోస్-యింత చిన్న ప్రశ్నకు నీకు జవాబు తెలియదు! ప్రపంచమందుండే వస్తువులన్నిటిలోకీ ముఖ్యమయినవి విధవలు. దాని విషయమై లెక్చరు యివ్వవచ్చును. మన దేశములో ఒక దురాచారము వున్నది. మొగవాడికి పెళ్లాము చచ్చిపోతే తిరిగీ పెళ్లాడు తాడు. ఆడదానికి మొగుడు చచ్చిపోతే యంత యవ్వనములో నున్నా యెంత సొగసుగా వున్నా, మరికడిని, పెళ్లాడడం వల్ల లేదు. ఇదీ అన్యాయమంటావా? కాదంటావా?

వెంకటే: తప్పకుండా అన్యాయమే.

బుచ్చమ్మ: యేమండీ గిరీశంగారూ - వెధవ, పెళ్లాడడం పాపంకాదూ?

గిరీశ : ఆహా! మీ సత్యకాలం చూస్తే నాకు విచారంగా నున్నది. వెధవలు పెండ్లాడవలసినదని పరాశరస్మృతిలో స్పష్టంగా నున్నది. వేదంలో కూడా నున్నది. రాజమహేంద్రవరములో యిదంతా పండితులు సిద్ధాంతం చేసినారు. పూర్వ కాలంలో వేధవలు పెండ్లాడేవారు. వెంకటేశం! నలచరిత్రలో దమయంతి రెండో పెండ్లి సాటించిన పద్యం చదువు.

వేంకటే: నాకురాదు.

గిరీశ : యంత ముఖ్యమయిన పద్యం మరచిపోవడం యంత తప్పూ! నోటుబుక్కుతీసిరాసుకో దమయంతి రెండో పెళ్లికి, ధరనుండే రాజు లెల్ల దడదడవచ్చిరీ - చూశావా! లోకంలో వుండే రాజులంతా వెధవని పెళ్లాడడానికి వచ్చారు. (బుచ్చమ్మ వైపుజూచి) చూశారా?

గురుజాడలు

165

కన్యాశుల్కము - తొలికూర్పు