పుట:Gurujadalu.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాడి) బుచ్చమ్మ వదిన గారూ తలుపుతీయండి (బుచ్చమ్మ తలుపుతీయును) వదీనా.... వెల్..... వేంకటేశం యేమి చేస్తున్నాడు?

బుచ్చమ్మ: పెరట్లో గొట్టికాయ లాడుతున్నాడు.

గిరీశ : ఈవూరువస్తే మరి చదువు చెడిపోతుంది. పట్నంలో వున్నప్పుడు డస్కుదగ్గిరనుంచి కదులుతే వొప్పేవాడను కాను... ఒక్క మాటు పి... పిలుస్తారా పాఠం చెపుతాను.

(బుచ్చమ్మ తమ్ముని తీసుకొని వచ్చుటకు వెళ్లును.)

ఆహా! దీని ఠస్సాకొయ్యా మొహం యెదటికి వచ్చేటప్పటికి కొంచెం టైంబ్లింగ్ పట్టుకుంటుంది. వకటి అనవలెనని మరి వకటి అనేస్తూ యుంటాను. మరెవళ్లూ లేరు. వంటరిగా దొరికింది. యీలాంటప్పుడు నా మనస్సులో మాట చెప్పేస్తే తీరిపోనా! ఆకోతి వెధవను తీసుకొని రమ్మని చెప్పినాను. కానీ, పాఠాలలో చిన్న లెక్చెరు వేతాము. (వెంకటేశ్వరులు, బుచ్చమ్మ ప్రవేశించుచున్నారు) యేమివాయి మైడియర్ బ్రదరిన్లా వెంకటేశం, పాఠాలు చదవడం శుభ్రంగా మానివేశావు? యిక్కడ మాసం రోజులుంటే వచ్చిందికూడా మరచిపోతావు, యేదీ టెక్ట్సు బుక్కు పట్టుకురా - (వెంకటేశం పుస్తుకు పట్టుకుని వచ్చును)

గాడ్స్‌వర్క్‌స్ అనే పాఠం తియ్యి, రీడ్ ఆన్ మైగుడ్ బోయ్.

వెంకటే: (తడుముకొనుచు) దేర్‌యిజ్ నాట్ ఏన్ ఆబ్జక్టు వుచ్ డజ్‌నాట్ సర్వ్ సమ్ యూస్‌పుల్ పర్‌పస్.

గిరీశ : అట్టె! అట్టె! అక్కడ ఆపు, క్రియేషన్ అనగా యేమిటి?

వెంకటే: క్రియేషన్ అనగా - అనగా - ఆవులు

గిరీశ : నాన్సెన్స్ చదవేస్తే ఉన్న మతి కూడా పోతున్నది. ఆవులు యెదుటున్నాయనా ఆవులంటున్నావు. మళ్లీ ఆలోచించి చెప్పు.

వెంకటే: యేమాటకి అర్థం అడిగినారు?

గిరీశ : క్రియేషన్.

వెంకటే: అదా! క్రియేషన్ అంటే ప్రపంచం. నేను యెదట ఆవులు కనబడితే యీ ఆవు పెరుగు యీ నెలరోజులే కదా తినడమనీ అనుకుంటున్నాను.

గిరీశ : వన్ థింగ్ ఎట్ ఏటైమ్. యిప్పుడు పాఠంమాట ఆలోచించు -క్రియేషన్ అనే వక్క మాట పైనే వక్క ఘంట లెక్చరు యివ్వవచ్చును. ప్రపంచం యేలాగున్నది? కపిద్దా కారభూగోళా అని మనుధర్మ శాస్త్రంలో చెప్పినాడు. కపిద్ధమంటే యేమిటి?

గురుజాడలు

164

కన్యాశుల్కము - తొలికూర్పు