పుట:Gurujadalu.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లుబ్ధావ: నాకు పిలిచేవారు యవరున్నారు? మీరే రేపురాత్రి బయలుదేరి పిలవండి, మీమ్మలిని నమ్ముకుని నేను యీ పనిలో దిగాను. కాని నాకు యంతమాత్రమూ యిష్టంలేదు.

రామప్ప: మీకోసం వక్కదమ్మిడీ అపేక్షించకుండా యంతశ్రమ పడుతున్నానో చూశారా! రేపురాత్రి అగ్రహారమంతాను, పెద్దిపాలెంలో లౌక్యుల్నీ పిలిచేటప్పటికి తెల్లవారిపోతుంది.

లుబ్ధావ: అగ్రహారంలో మీరుపిలిచి, పెద్దీపాలెం మరియవరినైనా పంపండి.

రామప్ప: అగ్రహారపు వైదీకపు వాళ్లని యవరయినా పిలుస్తారు. పెద్దిపాలెం వెళ్లి, లౌక్యుల్ని నేనేపిలవాలి. మేజువాణీవుంటేనే కాని వివాహము రాణించదుసుమండీ.

లుబ్ధావ: లేకపోతే బాధేమిటి?

రామప్ప: లేకపోతే పెద్దమనుష్యులు యవరొస్తారయా?

లుబ్ధావ: ఎల్లుండికి మేజువాణీ ఎక్కడవొస్తుంది.

రామప్ప: మన మధురవాణి వుందీకాదూ ఆపాటి చెయ్యిమరి ఈ జిల్లాలో యేదీ?

లుబావ: ఆ ఖర్చువెచ్చమంతా మీ ఇష్టానుసారమే అని చెప్పాను కానూ, అంతకు వక దమ్మిడీ హెచ్చీతే మాత్రం నేనివ్వజాలను.

రామప్ప: ఆలాగే కానియ్యండి (అని తనలో) ఆద్యంతాలు అయేసరికి మరి రెండు వందలు వీడిదగ్గిర లాక్కపోతే నేను మరియేమీ లౌక్యుణ్ణి.

లుబ్ధావ: (పొడుము పీల్చుచు) అమ్మీ పంతులుకు తాంబోలమియ్యి.

రామప్ప: అక్కరలేదు నేనే వెళ్లి తెచ్చుకుంటాను.

లుబ్ధావ: ఇదుగో నువ్వు వెళ్లకయ్యా.

(తెర దించవలెను)

***

గురుజాడలు

162

కన్యాశుల్కము - తొలికూర్పు