పుట:Gurujadalu.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లుబ్ధావ: మామగారూ (నిమ్మళముగా) యీ పంతులు వకడు శనిలాగు పోగయినాడు. యేదో వొక పెంటపెట్టి విశేషఖర్చుపెట్టిస్తూ వుంటాడు.

కరటక: (నిమ్మళముగా) మామగారూ యిటు పైన మీకు యేపనీ వచ్చినా, కావలసిన వాడిని గదా యిటుపైని నేనే చేసిపెడుతూ వుంటాను - మీరు శలవిచ్చినట్టు యీ పంతులు యింద్రజాలిలా కనపడుతాడు.

లుబ్ధావ: (నిమ్మళముగా) ఆ సంగతి నాకు మొదటినుండీ తెలుసును.

కరటక: (నిమ్మళముగా) నేను యవరినీ నమ్మలేకుండా వున్నాను. రూపాయిలు చేతులో పడితేనేకాని మంగళసూత్రధారణం చెయ్యనివ్వను సుమండీ.

లుబ్ధావ: (నిమ్మళముగా) ఆలాగే కానివ్వండి (బిగ్గరగా) ఇంతసేపు తాంబూలాలు తేవడ మేమిటయ్యా

రామప్ప: వస్తున్నాను మామా చక్కలు పడిపోయినాయి వేదుకుతూ వున్నాను.

(అని తాంబూలము పట్టుకొని ప్రవేశించుచున్నాడు. )

(లుబ్ధావధానులు కరటక శాస్త్రికి తాంబూలమిచ్చును.)

లుబ్ధావ: వీరిని, వివాహమయ్యే వరకు మీయింటనే ఉంచండి.

రామప్ప: యిక్కడే వుండకూడదా? మా యింట్లో చేసేవారెవరూ లేరు.

కరటక: నేనే చేస్తానయ్యా పదిమందికి (అనిలేచి) శలవుపుచ్చుకుంటాను.

రామప్ప: (రహస్యముగా) వెర్రిబ్రాహ్మడా యిక్కడే వుండవయ్యా

కరటక: (రహస్యముగా) వీళ్లయింట్లో వుండలేనండీ.

రామప్ప: (నిమ్మళముగా) అయితే నే వచ్చేదాకా అరుగుమీద పడుకొండి.

(కరటకశాస్రులు, శిష్యుడు, వెళ్లిపోవుచున్నారు. )

రామప్ప: యెల్లుండి పెళ్ళి నిశ్చయించాము. పుస్తెకట్టేటప్పుడు రూపాయీలు యివ్వాలట.

లుబ్ధావ: ఇంత కొద్ది కాలంలో, ఇన్ని రూపాయలెక్కడ, అప్పు దొరుకుతాయి.

రానుప్ప: పాతుతియ్యవయ్యా?

లుబ్ధావ: బాబూ నీ పుణ్యవుంటుంది కాని ఆమాట పదే పదే అంటూ వుండకు.

రామప్ప: యీ వ్యవహారము యంత సులభంగా కుదుర్చానో చూశారా! పెద్ద మనుష్యులని, భోజనాలకీ వాటికీ, పిలవడం ఎప్పుడేమిటి.

గురుజాడలు

161

కన్యాశుల్కము - తొలికూర్పు