పుట:Gurujadalu.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లుబ్ధావ: (పిల్లవైపు యగదిగ జూచి తనలో) పిల్ల యేపుగానూ, లక్షణంగానూ వున్నది. (పయికి) అయితే పన్నెండువందలా?

కరట : ఇప్పిస్తేనేగాని వీలులేదండి, భూములమీద కొంత ఋణం తీర్చుకోవాలి. యీ నెల 15వ తారీఖు వాయిదా - ఆలోగా రూపాయలు చెల్లకపోతే భూములు పోతవి. పెళ్లి యాలాగు కావలిస్తే ఆలాగు చేసుకొండి. మీ యింట పిల్లను దిగబెట్టి వెళ్లిపోతాను.

మీనాక్షి: ఇప్పటినుంచీ దిగపెట్టడమే.

లుబ్ధావ: నీ నోరు వూరుకోదుగదా?

కరటక: రామప్పంతులుగారూ - అలంకారాలమాట వూరుకున్నారు. అలంకారాలు పెట్టకపోతే పిల్లది చిన్నపోతుంది. వివాహసమయమందే వుంచితేనేకానీ వొప్పేదిలేదు.

లుబ్ధావ: అలంకారం ఒక పిసరయినా వుంచేదిలేదు.

రామప్ప: (లుబ్ధావధానులు చెవులో) చెడగొట్టకయ్యా వ్యవహారం సులభంగా కుదిరింది.

లుబ్ధావ: (రామప్పంతులుతో) యింట్లో వక పిసరైనా బంగారంలేదు. యేలాగు పెట్టడము?

రామప్ప: (లుబ్ధావధానులతో) నేను యెక్కడనైనా రహస్యంగా ఒక కంటె యెరువు తీసుకువస్తాను, పెళ్లప్పుడువుంచి తరవాత తీసి యిచ్చివేదాము (కరటకశాస్త్రులవైపుచూచి) అలంకారం విషయమై మీ ఇష్టానుసారం ఫైసలు చేశామండి.

కరటక: అయితే సంతోషమే - ఇక మీ పిల్లగాని నా పిల్లగాదు. దాని కేమి సరుకులు పెట్టుకున్నా మీవేగదా?

రామప్ప: మామా అయితే తాంబూలం యిప్పించేయండి.

లుబ్ధావ: అమ్మీ తాంబూలం తేవే.

(మీనాక్షి వెళ్ళుచున్నది. )

రామప్ప: నేనే పట్టుకువస్తాను (అని వెనుక వెళ్లుచున్నాడు. )

కరటక: మీకు వేరే సంబంధం కుదిరి తేలిపోయినదటే.

లుబ్ధావ: అవునండి, పిల్లదాని నక్షత్రము మంచిదయిందికాదు.

కరటక: అలాగునా! శుభస్య శీఘ్రం అన్నారు. పంతులూ నేనూ ముహూర్తం దగ్గిరగా నిర్ణయించాము - చూచారండీ కార్యమేదో క్లుప్తంగా కానీండి. విజయనగరం ఆనందవర్ధనీ సమాజమువారు, సదస్యమూ, నాగవిల్లీ, చెయ్యనక్కరలేదన్నారు.

గురుజాడలు

160

కన్యాశుల్కము - తొలికూర్పు