పుట:Gurujadalu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కరటక: ఈ లండాచోరీలో దిగడానికైనా డబ్బుండాలి కదా? పిల్లకి యేలాగైనా పెళ్ళిచేస్తేనే కాని డబ్బూ దొరకదు. టొంపలాగు యిది నాతో తిరుగుతూ వుంటే స్వేచ్ఛావుండదూ.

రామప్ప: మీకు దొరికేదానిలో సఘం రూపాయిలు యిస్తే వక తంత్రం చేసి వివాహం కుదురుస్తాను.

కరటక : సఘం మీకిస్తే నేను ఋణం యేమితీర్చుకోను.

రామప్ప: ఋణం తీర్చుకోనక్కరలేకుండా గ్రంధం జరిగిస్తానుగదా.

కరటక: (ఒక నిమిషమాలోచించి) అయితే కానియ్యండి. అంతా మీదే భారం, పిల్లదాని కలంకారం వుంపిస్తారా.

రామప్ప: ప్రయత్నం చేస్తాను కానీ ఖరారు చెయ్యజాలను, వాడు పీసరికొట్టుముండా కొడుకు - అయినా నా ప్రతాపం చిత్తగించండి - అవునే కలం, కాయితం, సిరాబుడ్డీ తీసుకురా - (వ్రాయుచు గరటకశాస్త్రులవైపు జూచి) మీరు రేపు జామురాత్రికి రండి.

***

అయిదవస్థలము - లుబ్ధావధానులుగారి ఇల్లు, లుబ్ధావధాన్లు, రామప్పంతులు, మీనాక్షీ, ప్రవేశించుచున్నారు.

రామప్ప: అయితే మూడువందలకా సిసలు.

లుబ్ధావ: ఒక యాభై కొట్టివేస్తే బాగుండును.

రామప్ప: వక దమ్మిడీ తక్కువైతే నేను సరపలాగీ చెయ్యలేను. మరి యెవరిచేతనైనా చేయించుకోండి.

లుబ్ధావ: పోనీయండి నేనన్నమాటా వద్దు, మీరన్నమాటా వద్దు, ఒక పాతిక కొట్టి వేయండి.

రామప్ప: అయిదువందలల్లా, మూడువందలదాకా దించాను. ఇక నొక దమ్మిడీకొట్టేస్తే నాకీ వ్యవహారం అక్కరలేదు. అగ్నిహోత్రావధానులు మహా కోపిష్టిముండా కొడుకు, లాంఛనాలలో యేమిలోపం వచ్చినా వూరుకోడు.

(తెరలో) యిదిగో వుత్తరంబాబూ.

రామప్ప: యేవూరినుంచేమిటి.

కూలివాడు: కృష్ణారాయపురం అగ్ఘురారంనుంచీ బాబూ.

రానుప్ప: యిదిగో అప్పుడే మీ మామగారివద్దనుంచీ వుత్తరాలు వస్తున్నాయి.

గురుజాడలు

156

కన్యాశుల్కము - తొలికూర్పు