పుట:Gurujadalu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ రాయుడుగారు ముందుగా గురజాడ తెలుగు రచనలు అచ్చుకు సిద్ధం చెయ్యడానికి పూనుకోవడం వల్ల నాపరిశ్రమకు చాలా సమయం లభించింది. మొదట 1914లో అచ్చయిన డిసెంట్ నోట్‌లో గురజాడ ఇచ్చిన బట్టర్‌వర్తు నెల్లూరుజిల్లా శాసనపాఠాలను మూలంతో సరిచూసి అచ్చుతప్పులు సవరించడం మాత్రమేగాక, పాఠకుల సౌలభ్యం కోసం ఆయా తాలూకాల పేర్లన్నీ అకారాది క్రమంలో ఏర్పాటు చేశాను. 1914 ప్రతిలో ఇంగ్లీషు పుస్తకాలు, రచయితల పేర్లలో వచ్చిన ముద్రారాక్షసాలను సవరించగలిగాను. ఈ ప్రతిలో వీరేశలింగం, జయంతి రామయ్య పంతులు మొదలైన వాళ్ళ పేర్లు రకరకాలుగా కన్పిస్తాయి. రాబోయే తరాల పాఠకులను దృష్టిలో ఉంచుకొని ఆయా వ్యక్తుల పూర్తిపేర్లను ఇచ్చాను. ఇటువంటివే, చిన్న చిన్న సవరణలు తప్ప పాఠాన్ని (text) ఎక్కడా మార్పు చెయ్యలేదు.

గురజాడ రాసిన జాబులు, ఆయనకు ఇతరులు రాసిన జాబులు, లభించినవన్నీ ఈ సంపుటంలో చేర్చాము. పుస్తకం అచ్చుకు వెళ్ళే వరకు అలా చేర్చుతూనే వచ్చాము. ఒకటో రెండో ఉత్తరాలు పూర్తిగా జిలుగు రాతలో ఉండి బోధపడకపోవడం చేత వాటిని విడిచిపెట్టవలసి వచ్చింది. మరికాస్త సమయం ఉండి ఉంటే అవి కూడా ఈ సంపుటంలో చేరి ఉండేవి. గురజాడ ఇంగ్లీషు లేఖలలో తెలుగు లేఖలు కూడా చేర్చాము - పాఠకులకు లేఖలన్నీ ఒకేచోట అందుబాటులో ఉంటాయనే ఆలోచనతో. ఏట్సు, హంటర్, గిడుగు రామమూర్తి మొదలైన ఆత్మీయులు గురజాడ రామదాసుకు పంపిన సంతాపసందేశాలను కూడా గురజాడ లేఖల్లో చేర్చాము. 1929లో గిడుగు రామమూర్తి గురజాడ రామదాసుకు రాసిన రెండు ఉత్తరాలను కూడా ఇందులో చేర్చాము. గురజాడ వ్యక్తిత్వానికి, రచనలకు సంబంధించిన విషయాలు వీటిలో ఉన్నాయి.

ఎఫ్.హెచ్.స్క్రిని (F.H.Skrini, ICS) రీస్ అండ్ రయ్యత్ సంపాదకులు శంభుచంద్ర ముఖర్జీ జీవిత చరిత్రను, ఉత్తరాలను ఒక పుస్తకంగా అచ్చువేశాడు. ఏభై ఏళ్ళ క్రితమే ఇందులో ఒకటి రెండు ఉత్తరాలు తెలుగులోకి అనువదించబడ్డాయి కూడా. ఇందులోని గురజాడకు సంబంధించిన ఉత్తరాలన్నింటినీ పాఠకుల సౌలభ్యం కోసం 'గురుజాడలు'లో యథామాతృకంగా చేర్చాము.

జూనియర్ వేదం వెంకటరాయశాస్త్రి తమ తాతగారు వేదం వేంకటరాయశాస్త్రి జీవితచరిత్రను తెలుగులోను, ఇంగ్లీషులోను రచించారు. ఆ రచనల్లో గురజాడ వేదం వేంకటరాయశాస్త్రికి రాసిన లేఖలను ఆయన ఉదహరించారు. ఆ లేఖలు ఊడా ఈ సంపుటంలో చేర్చబడ్డాయి.