పుట:Gurujadalu.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గిరీశ : ఒపీనియన్సు అప్పుడప్పుడు ఛేంజిచేస్తూ వుంటేనే కాని పొలిటిషన్ కానేరడు. నాకు తోచిన కొత్త ఆర్గ్యుమెంటు చూచావా? ఇన్‌ఫెంటు మేరియేజి వుంటేనే కాని విడోస్ అట్టే వుండరు. విడోస్ వుంటేనే కాని విడోమేరియేజి రిఫారము కాదుగదా. సివిలిజేషను కల్లా ఎసెన్‌షియల్ విడోమేరియేజే. కన్యాశుల్కము తప్పులేదని కూడా ఇప్పుడు నేవాదిస్తాను.

వెంకటే: యేలాగేమిటి?

గిరీశ: కన్యాశుల్కములేని మేరియేజి వుందిటోయి లోకంలోను డబ్బుపుచ్చుకుంటే నేమి, సరుకులు పుచ్చుకుంటేనేమి, లేక ఇంగ్లీషువాళ్లలాగ సెటిల్ మెంటు చేస్తేనేమి, ఈ ఆర్గ్యుమెంటు రాత్రి మీ నాన్నతో చెప్పేటప్పటికి చాలా సంతోషించాడు.

వెంకటే: రాత్రి యింకా యేమి మాట్లాడరేమిటి?

గిరీశ: నీకు జడ్జిపనిదాకా చదువు చెప్పించేస్తానన్నాడు. పుస్తకాల సంగతి కదిపాను గాని, పెళ్లినుంచి వచ్చిన తరువాత యిస్తామన్నాడు. ఈలోగా సిగర్స్ లేకపోతే గుడ్లెక్కొస్తాయి. పట్నం నుంచి తెచ్చిన అరకట్టా అయిపోయింది. దొంగ తనంగా చుట్టకాల్చుకుందామని రాత్రి పక్క వీధరుగుమీద వేసుకుంటే మీ తండ్రి కూడా బిచాణా అక్కడే వేశాడు. సిగర్స్ కోసం యేమయినా కాపర్స్ సంపాదించావా లేదా?

వెంకటే: లేదు - ఈ వుదయమల్లా అమ్మ, ధుమ ధుమలాడుతున్నది. పొడుంకోసం మా నాన్న కొట్టులో నిలువచేసిన పొగాకులోది వక కట్ట వోణీలో దాచి పట్టుకొచ్చాను.

గిరీశ : దటీజ్ పోలిటిక్స్ మైడియర్ బోయ్! మరి యింతసేపూ చెప్పావుకావేమి- చుట్టలు చుట్టుకుని ఈ కోవిలగోపురంలో కూర్చుని కాల్చుకుందాము.

వెంకటే: కోవిలలో చుట్టకాల్చవచ్చునా?

గిరీశ: కాలుస్తే కోవిలలోనేకాల్చవలెనోయి - దీని పొగముందర సాంబ్రాణీ, గుగ్గిలంయేమూల. యేదీ కట్ట యీలాగునతే (అని యందుకొని వాసనచూచి) హా యేమి పొగాకోయి - నిజంగా కంట్రీలైఫులో చాలా చమత్కారం వున్నది. బెస్ట్ టొబాకో - బెస్టు గేదెపెరుగు, మాంచి ఘీ అందుచేతనేనోయి పొయట్సు కంట్రీలైఫు కంట్రీలైఫు, పేస్టొరల్ లైఫ్ అని దేవులాడుతారు?

వెంకటే: మీరూ పోయట్సేకదా?

గిరీశ : అందుకు అభ్యంతరంయేమిటి? నాకు కంట్రీలైఫు యిష్టమే గాని సీమలోలాగ బ్యూటిఫుల్ షెప్పర్డెసెస్, లవ్ మేకింగూ వుండదోయి - గ్రాస్గర్ల్సు తగు మాత్రంగా వుంటారుకాని మాడర్టీస్మెల్, అదొకటిన్నీ మనదేశంలో మెయిడ్సువుండరోయి చిన్నప్పుడే మేరీచేస్తారు. యిక నెంతసేపూ లవ్ మేకింగ్ విడోసుకి చెయ్యాలిగాని మరి సాధనంలేదు.

గురుజాడలు

148

కన్యాశుల్కము - తొలికూర్పు