పుట:Gurujadalu.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వస్తారు. మన టౌన్‌లోనే పెద్ద మీటింగులు చెయ్యాలంటే డప్పులు బజాయించి నోటీసులు కట్టి బాజారులు కాసి తోవంట వెళ్లిపోయే వాళ్లందరినీ యీడ్చుకుని వచ్చినాకాని వక యాభై మందికారు. పల్లెటూరి పీపిల్ లెక్చురుకు అన్‌ఫిట్. మొన్న మనము వచ్చిన బండివాడికి నేషనల్ కాన్‌గ్రెస్ విషయమై రెండు ఘంటలు లెక్చరు యిచ్చేసరికి ఆ గాడిదకొడుకు వాళ్ల వూరు హెడ్‌కానిస్టేబులుని కాన్‌గ్రెస్‌వారు యెప్పుడు బదిలీ చేస్తారని అడిగాడు. విలేజస్‌లో లెక్చర్లు యంతమాత్రం కార్యంలేదు. నీ తండ్రిదగ్గిరమాత్రం లెక్చరు అన్న మాటకూడా అనకు.

వెంకటే: అయితే ఆయన్ని ఏలాగు జేబులో వేశారేమిటి?

గిరీశ: అది పోలిటిక్సు దెబ్బోయ్! ఆ తరువాత కథవిను. నా మీద కేకలు వేశిన తరువాత కోపం అణక్క ధుమధుమలాడుకుంటూ పెరుగూవణ్ణం కుమ్మడం ఆరంభించాడు. యింతట్లో మీ అప్పవచ్చి గుమ్మందగ్గర నిలువబడి కోకిలకంఠంతో నాన్నా తమ్ముడికి పెళ్లి చెయ్యాలంటె నా సొమ్ముపెట్టి పెళ్లిచెయ్యండి గాని దాని కొంపదీసి చెల్లెలని లుబ్ధావధానులకి ఇవ్వవద్దని చెప్పింది. దానితో వుత్తరవుపోసనం పట్టకుండానే ఆ పెరుగూ అన్నం విస్తరి తీసుకువెళ్ళి దానినెత్తిమీద రుద్దేశాడు. కరటకశాస్త్రుల్లు అడ్డపడబోయేటప్పటికి చెంబులో నీళ్లు అతనినెత్తిమీద దిమ్మరించాడు. దానితో కోపంవచ్చి కరటకశాస్త్రుల్లూ అతని శిష్యుడూ అప్పుడే బయలుదేరి వాళ్ల వూరికి వెళ్ళిపోయినారు.

వెంకటే: ఇదేనా ఏమిటి మా నాయన్ని జేబులో వేశెయ్యడం?

గిరీశ : కొసాకు విను మరి కరటకశాస్త్రుల్లు స్కౌండ్రల్ వెళ్ళిపోయాడని సంతోషించాను కాని మీ సిస్టర్ ఫేట్ విషయమై మహా విచారమయినది. నేనే దాని హజ్‌బెండ్ అయినట్టయితే నీ తండ్రిని నిలబడినచోట రివాల్వర్‌తో షూట్ చేసేదును. మీ అమ్మ ఏడుస్తూ వకమూల కూర్చున్నది. అప్పుడు నేను నీళ్ల పొయిలో నిప్పువేశి నీళ్లుతోడి మీ సిస్టరుని తీసుకువెళ్ళి స్నానం చేయించినాను. ఇంతట్లో మీ తండ్రికి పశ్చాత్తాపము వచ్చి నేను అరుగుమీద పక్కవేసుకుని పడుకుంటే మాటల్లో పెట్టి తెల్లవారినదాకా నిద్దరపట్టనిచ్చాడుకాడు, మొత్తము మీద కత్తుకలిపేసినాడు. అతను చెప్పినదానికల్లా సహీచేశాను. కరటక శాస్త్రుల్లు మీదమట్టుకు గట్టిగా బజాయించేశాను. మొత్తముమీద ఇన్‌ఫెన్‌టు మేరియేజి బాగా ఆలోచిస్తే కూడును అని తోస్తున్నది.

వెంకటే: ఇన్నాళ్లూ కూడదని చెప్పేవారే నాతోటి?

గురుజాడలు

147

కన్యాశుల్కము - తొలికూర్పు