పుట:Gurujadalu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జి.సి.వి. శ్రీనివాసాచార్యుల హరిశ్చంద్ర నాటకానికి గురజాడ ఇంగ్లీషులో రాసిన 'ప్రిఫేస్'ను విజయనగరం నుంచి మిత్రులు డాక్టర్ ఉపాధ్యాయుల నరసింహమూర్తిగారు పంపించారు. భాగవతుల లక్ష్మీనారాయణశాస్త్రి శ్రీరామ విజయవ్యాయోగానికి గురజాడ రాసిన పరిచయాన్ని అమెరికానుంచి ప్రొఫెసర్ వెల్చేరు నారాయణరావుగారు పంపించారు. జార్జిదేవచరితకు గురజాడ సమకూర్చిన ఉపోద్ఘాతం లేకుండానే 'గురుజాడలు' వెలువరించవలసి వచ్చిందనే అసంతృప్తి మాత్రం నాకు మిగిలిపోయింది.

గోపాలకృష్ణ గురజాడ లేఖలకు ఒక కాపీ తయారుచేశారు.

ఒక గురజాడ చేతిరాతను మాత్రమే కాదు, గురజాడకు జాబులు రాసిన వారందరి రాతపద్ధతులను అవగాహన చేసుకొని, ఆ లేఖలన్నీ ఆయన చదవగలిగాడు. ఇదంతా ఒక్కరోజులో జరిగింది కాదు. నెలల తరబడి శ్రమించి, ఆ కార్యాన్ని సాధించగలిగారు. ఉత్తరాలను అచ్చుకు సిద్ధం చేస్తున్న సమయంలోనే ఆయన తీవ్రంగా అస్వస్థులయ్యారు. రెండు మూడు పర్యాయాలు నన్ను హైదరాబాదుకు పిలిపించుకొని, కంప్యూటర్ ఆపరేటరును పక్కన కూర్చో బెట్టి నాచేత ఉత్తరాలను డిక్టేట్ చేయించారు; ప్రూఫులు దిద్దించారు. 2011 ఏప్రిల్ మాసాంతానికి లేఖలకు ఒక రూపం ఏర్పడింది.

చివరిసారి నేను, నా శ్రీమతి గోపాలకృష్ణగారిని చూడడానికి 2011 మే 18న హైదరాబాదు వెళ్ళాము. ఇంటినిండా బంధువులు, పరిచయస్తులు. ఆయన నన్ను గదిలోకి పిలిపించుకొని, ఆక్సిజన్ మాస్కు తీసివేసి, గంటసేపు మాట్లాడారు - ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూనే. గురజాడ లేఖలు, ఇతర రచనలు సమగ్రంగా పూర్తి చెయ్యడానికి అవసరమైన సూచనలిచ్చి, నన్ను మిగిలినపని పూర్తి చెయ్యమన్నారు. ఆయనకు పూర్తిగా నమ్మకం కుదిరింది, నేను ఈ బాధ్యతను నిర్వహించగలనని.

కన్నీళ్ళు బలవంతాన ఆపుకొని వీడ్కోలు తీసుకొని గదిలోంచి వచ్చేశాను.

గోపాలకృష్ణగారు 2011 మే 27వ తేదీన తుదిశ్వాస విడిచారు.

***

శ్రీ ఎం.వి. రాయుడుగారు నన్ను సంపాదక బాధ్యత తీసుకొని ప్రాజెక్టును పూర్తిచేయమని కోరారు. సహ సంపాదకులుగా ఉండి సహకరించమని వారిని నేను కోరాను. ఆయన అంగీకరించి, గురజాడ రచనలు మొట్టమొదటిసారి ప్రచురించబడిన పత్రికలను, పుస్తకాలను సాధించి తెచ్చారు. రీస్ అండ్ రయ్యత్‌లో అచ్చయిన గురజాడ సారంగధరను, గురజాడ తమ్ముడు శ్యామలరావు రచన "తాంతియా ది భిల్"ను తెప్పించారు.