పుట:Gurujadalu.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గిరీశ: యిలాంటివి తప్పించుకోవడమే ప్రజ్ఞ. యేమైనా డిఫికల్టీ వచ్చినపుడు ఒక ఠస్సా వేసినామంటే బ్రహ్మ భేద్యముగా ఉండవలెను. పోలిటిషన్ అంటె మరేమిటనుకున్నావు, పూజా నమస్కారాలు లేక బూజెక్కి వున్నాను గాని మన కంట్రీయే ఇన్‌డిపెండెంటు అయిపోతే గ్లాడ్‌స్టన్‌ లాగు దివాన్‌గిరీ చెలాయిస్తును. ఏమివాయి మీ తండ్రి వైఖరి చూస్తే పుస్తకాలకి సొమ్ముఇచ్చేటట్టు కనబడదు. చుట్టలు పట్నమునుంచి అరకట్టే తీసుకుని వచ్చినాను.

వెంకటే: నాన్న యివ్వకపోతే అమ్మనడిగి పుచ్చుకుంటాను.

గిరీశ: యూ ఆర్ ఏ వెరి ఇన్‌టిలిజెంటు బోయ్. దట్ ఇజ్ ది ప్రొపర్‌వే. యూ విల్ వన్‌డే బికమ్ ఏ గ్రేట్ పొలిటిషన్.

(బుచ్చమ్మ ప్రవేశించును.)

బుచ్చమ్మ: తమ్ముడూ అమ్మ కాళ్ళు కడుక్కోమంటూంది.

గిరీశ : (తనలో) హౌ బ్యూటిపుల్‌ క్వైట్ అనెక్స్‌పెక్టెడ్‌.

బుచ్చమ్మ: అయ్యా మీరు చల్దివణ్ణము తించారా?

గిరీశ: నాట్‌ది స్లైటెస్టు అబ్‌జెక్షన్. యెంతమాత్రమూ అభ్యంతరము లేదు. మీరే వడ్డిస్తారా యేమిటి?

బుచ్చమ్మ: మీకు ఆలిశ్యం వుందా.

గిరీశ : నాట్ ది లీస్టు. యెంతమాత్రమూ ఆలిశ్యములేదు. వడ్డించెయ్యండి. ఇదిగో వెళ్ళి పోవస్తాను. తోవలో యేటివద్ద సంధ్యావందనమూ అదీ చేసుకున్నాను.

(బుచ్చమ్మ నిష్క్రమించుచున్నది.)

గిరీశ: వాట్‌. యీవిడ మీసిస్టరా? తలచెడ్డట్టు కనబడుతున్నదే?

వెంకటే: అవును.

గిరీశ: యిన్నాళాయి నీకు విడో మారేజి విషయమై లెక్చరిస్తూంటే ఈ కథ యెప్పుడూ చెప్పినావుకావు. మీ ఇంట్లోనే ఒక అన్‌ఫార్చునేట్‌ బ్యూటిఫుల్‌ యంగు విడో వున్నదోయి! మైహార్టు మెల్టుస్‌ నేనే తండ్రినైతే యెవరికైనా ఇచ్చి పెళ్ళిచేసేదును. (తనలో) ఇంత చక్కని పిల్లనెక్కడా చూడలేదు. పల్లెటూరు వూసుపోదనుకున్నాను గాని కాంపేన్ ఓపెన్ చేసి పని జరిగించడముకు మంచాపర్చూనిటీ యీ పల్లెటూరిలో కూడా తటస్తించడం నా అదృష్టం. (పైకి) మీ సిస్టర్‌కి చదువు వచ్చునా.

గురుజాడలు

143

కన్యాశుల్కము - తొలికూర్పు