పుట:Gurujadalu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గిరీశ : సెల్లింగ్ గర్ల్స్‌! డామిట్‌.

అగ్నిహో : ప్రతిగాడిదకొడుకూ అమ్మేవు అమ్మేవు అంచూవుంచాడు. కూరగాయషోయి - అమ్మడానికి - ఆ రూపాయీలు పుచ్చుకోకపోతే మొగుడు చచ్చాడు గదా దానిగతి యేమవును, వడ్డీతో కూడా ఇప్పుడు ౧౮౦౦ రూపాయలు అయినవి. దాని మానాన్న అది బతకవచ్చును.

కరటక: చచ్చాడంటే వాడిది తప్పా? మంచంమీంచి దించివేయడానికి శిద్ధముగా వున్నవాడికి పెళ్ళిచేసినావు. సదశ్యం నాడు వెంకుపంతులుగారు వచ్చారు కారని భోజనాల దగ్గిర కనిపెట్టుకు వుండేసరికి గుడ్లు పేలిచచ్చాడు. అగ్నిహోత్రావధానులూ! నేను యెరగనట్లు చెప్పుతావేమిటి?

గిరీశ : తమరేనా, నులక అగ్నిహోత్రావధానులుగారు. జటలో తమతో సమానులు లేరని రాజమహేంద్రవరంలో అనుకునేవారు.

అగ్నిహో-- మీది రాజమహేంద్రవరంటండీ. ఆ మాట చెప్పారు కారేమి. రామావుధానులు గారు ఖులాసాగా వున్నారా? ఆయన గొప్ప ఘనాపాటీ.

గిరీశ : ఖులాసాగా వున్నారు. నేను ఆయన మేనల్లుణ్ణే నండి నాపేరు గిరీశం అంటారు.

అగ్నిహో: ఆలాగునండీ చెప్పారు కారూ.

గిరీశ : మా మామగారు ఎప్పుడూ ఎవరువచ్చినా మిమ్ములనే పొగుడుతూ వుంటారు.

అగ్నిహో:ఎవరో అనుకుని యిందాకా అన్నమాటలు క్షమించాలి సుమండీ. నేను కొంచెం ప్రథకోపిని.

గిరీశ: దానికేమిటండీ. తమవంటి పెద్దవాళ్ళు అనడమూ - మావంటి కుర్రవాళ్లు పడడం విధి.

కరటక : (తనలో) యీ అగ్నిహోత్రావధాన్లుకి తగినవాడు దొరికాడు.

అగ్నిహో-- చూచారండీ మా కరటకశాస్త్రి వట్టి అవకతవక మనిషి మంచీ చెడ్డా యేమీ తెలియదు. అల్లుడు చచ్చిపోయినాడంటే అందువల్ల యంతలాభం కలిగింది? భూములకి దావా తెచ్చామా లేదా! గిరీశంగారూ నేను యీమధ్య దాఖలుచేసిన అర్జీ పట్టుకొస్తాను దానిమీద యిండారుసు చదవండీ (అని గదిలోనికి వెళ్ళి తీసుకొనివచ్చి చేతికిచ్చుచున్నాడు)

గిరీశ : (కాకితము నెగదిగజూచి) ఎవరో తెలివి తక్కువ గుమాస్తా వ్రాసినట్టువున్నది గాని యెక్కడా అక్షరం పొల్తిలేదండీ.

గురుజాడలు

139

కన్యాశుల్కము - తొలికూర్పు