పుట:Gurujadalu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెంకమ్మ: ఆయన వెర్రివాడు, ఆయనమాట గణనలోకి తేకు బాబూ! యాలాగైనా మా వాణ్ణి కడుపులోపెట్టుకుని ఒక ముక్క అబ్బేటట్టు చేయిబాబూ. వాడు వట్టి సత్తెకాలం నాయన. నామోస్తరే.

గిరీశం : అభ్యంతరమేమిటమ్మా, మీవాడు శలవులలో చదువు చెప్పమని యెంతో బతిమాలుకుంటే పోనీ పనికివచ్చే కుర్రవాడుగదా అని వచ్చినాను. లేకుంటే పట్నంలో పంచపక్వ పరమాన్నాలు మానుకుని ఇక్కడ ముతక బియ్యం తినడానిక ఎందుకువస్తాను.

కరటక: (తనలో) వీడు టక్కర్‌లా వున్నాడు.

వెంకమ్మ-- ఈ చదువులకోసమని పిల్లలను వదులుకుని వుండడం వార్లక్కడ శ్రమదమాదులు పడుతూవుండడం, నాప్రాణాలు యెప్పుడూ అక్కడే వుంచాయి. డబ్బంటే యెప్పుడూ వెనకచూడలేదుగదా. మేము కనడం మట్టుకుకన్నాము. మీరే తల్లీతండ్రీ వాడిని యేలాగు బాగుచేస్తారో మీదేభారం.

గిరీశ-- మీరు ఇంతదూరం శలవు యివ్వవలెనా. నా మంచీ చెడ్డా మీకుర్రవాణ్ని అడిగితేనే తెలుస్తుంది. ఇంతెందుకు ఇక మూడుసంవత్సరములు నా తరిఫీతులో వుంచితే క్రిమినల్ లోవర్ అనగా పోలీసు పరీక్ష ప్యాసు చేయించివేస్తాను. డబ్బువిషయమై మట్టుకు మీరు వెనక తీయకుండా వుండాలి.

అగ్నిహో: యీ సంవత్సరం పుస్తకాలకి యెంతైందిరా అబ్బీ?

వెంకటే: పదిహేను రూపాయిలవుతుంది.

అగ్నిహో: ఒక్క దమ్మిడీ ఇచ్చేది లేదు. వీళ్లిద్దరూ కూడి ఆ రూపాయలు పంచుక తినేసేటట్టు అగుపడుచుంది గాని మరేమీ లేదు. నేను వేదము 82 పన్నాలూ జటాంతం వరకూ పుస్తకాల కింద ఒక దమ్మిడీ ఖర్చు లేకుండా చదువుకున్నాను. ఇదంతా టోపీ వ్యవహారంలాగా కనపడుతుంది.

కరటక: (ముఖంవంకబెట్టి నవ్వుకొనును)

గిరీశం: (కరటకశాస్త్రుల వైపుచూచి) బార్బరస్‌, చూచారండీ జెన్‌టిల్‌మ్యాను అనగా పెద్దమనిషిని యెలాగు అంటున్నారో- నేను యీ నిమిషం వెళ్లిపోతాను.

వెంకమ్మ-- చాలు. చాలు. బాగానే వున్నది! ఇంటికి ఎవరైనా పెద్దమనిషి వస్తే నాకిదే భయం. ఆయన మాటల కెక్కడికి -బాబూ వెళ్లకండి. అన్నిటికీ నేను వున్నాకదా.

కరటక: అగ్నిహోత్రావధానులూ కుర్రవాడికి రవ్వంత చదువు చెప్పించడానికి ఇంత ముందూ వెనకా చూస్తూన్నావు. బుచ్చమ్మని అమ్మిన పదిహేను వందల రూపాయిలూ యేమిచేసినావు.

గురుజాడలు

138

కన్యాశుల్కము - తొలికూర్పు