పుట:Gurujadalu.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెనుకా చూస్తున్నారు. మీలాగే వాడూ పెద్ద కడుపు వేళ్లాడేసుకుని జంఝాలు వడుక్కుంటూ బతకాలని వుందా యేమిటి? మీకంత భారమనితోస్తే మా వాళ్లు నా పసపూ కుంఖానికి యిచ్చిన భూమి అమ్మేసి కుర్రాడికి చదువు చెప్పిస్తాను.

కరటక: నీ భూమి యెందుకు అమ్మాలి మన సొమ్ము చెడతిని కొవ్వివున్నాడు అతనే పెట్టుకుంటాడు.

అగ్నిహో: అయితే నా కడుపును ఆక్షేపణ చేస్తావషె? యీ మారంటె నీ అన్న వున్నాడని వూరుకునేది లేదుసుమా!

(గిరీశ, వెంకటేశ్వర్లు, ప్రవేశించుచున్నారు.)

వెంకమ్మ: మా బాబు - మా బాబు వచ్చావషోయి (అని లేచి వెళ్లి కవుగలించుకొనుచున్నది)

అగ్నిహో: వెధవాయా. యీ మాటైనా ప్యాసు అయినావా లేదా?

వెంకటే: (తెల్లబోయి జూచుచున్నాడు)

గిరీశ: ప్యాసు అయినాడండి. ఫస్టుగా ప్యాసయినాడు.

అగ్నిహో: యీ తురక యెవడోయి?

గిరీశ : టర్క్! డామిట్, టెల్‌మాన్.

అగ్నిహో: మాన్! మానులావున్నానంఛావు? గూబు పగలగొడఛాను.

వెంకటే: (వణుకుతూ తల్లివైపుచూచి) అమ్మా యీయనే నాకు చదువు చెప్పుతాడు.

కరటక: ఇంటికి పెద్దమనిషి వస్తే అపృచ్ఛపు మాటలాడుతావేమి ఇంగ్లీషుమాట ఆయనేమో కుర్రవాడితో అంటే పుచ్చకాయ దొంగంటే బుజాలు తడుముకున్నట్టు నీ మీద పెట్టుకుంటావేమి.

(బండివాడు సామాను దించును)

గిరీశ : తమరు యిక్కడా వున్నారు. నన్ను తమరు యరగకపోయి వుండవచ్చును గాని సంస్కృత నాటక కంపెనీలో తమర్ని తరుచుగా చూస్తూ వుండేవాడిని. యిండియా అంతా తిరిగినాను. గాని తమవంటి విదూషకుణ్ణి యక్కడా చూడలేదు. సంస్కృతం, అరవం, మహారాష్ట్రం, యింకా యెన్నో భాషలు మంచినీళ్ల ప్రవాహంలా మాట్లాడుతారు.

అగ్నిహో: (ధుమధుమలాడుచు) యీ శెషభిషలు నాకు పనికిరావు. ఈయన వైఖరి చూస్తే యిక్కడే బసవేసేటట్టు కనబడుతున్నది. నా యింట్లో భోజనం యంత మాత్రమూ వీలుపడదు.

గురుజాడలు

137

కన్యాశుల్కము - తొలికూర్పు