పుట:Gurujadalu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



కుసుమ శర విద్దు లయ్యును
కుసుమంబులె కొందు రచటి కోవిదులు విటుల్
విసమునకు మందు విసమగు
నసమాయుధు వేటు తీట లలరులె మాన్చున్.

చూతము మీ మీ జాతుల
నాతిరొ యన విటులు బల్కె నగి లావికలున్
ప్రీతిగలదేని జాతులు
జూతురె మా జాతులెల్ల జోద్యము లనరే.

చక్కదనంబు నశ్వరము చానరొ వింటివె నీవు నా యెడం
జిక్కతనంబు జూపు టిటు చెల్లునె లోభి ధనంబు సర్వముం
బొక్కసమందు దాచు గతి బొంగెడు నా వెలలేని సొంపు నా
మక్కువనెల్ల గొంటి వొక మాట నొసంగుట భారమయ్యెనే!

చక్కదనంబు నశ్వరము సత్యమె మక్కువ లెల్ల కాలమున్
మిక్కుటమై చెలంగునొకొ, మిత్రమ చీమలు చుట్టుముట్టుచుం
జక్కెర చెల్లుదాక బలు సందడి జేయుచు వీడు కైవడిన్
జొక్కపు ప్రాయ మేగు తరి సున్న కదా మగవారి మక్కువల్!

గురజాడలు

110

కవితలు