Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.9 (1935).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భాగము నొక గ్రంథమునుండి చదివి చించుకు పోయినాడు. చదువుకొన్న వారే ఇట్లుండగా మిగిలిన వారి విషయము వేరే చెప్పనక్కరలేదు మనదేశము బానిస దేశముగా నున్నది. మనకు ఇట్టి బానిసభావా లుండడములో నాశ్చర్యములేదు.

మన దేశమండలి గ్రంథాలయములలో బాలుర జ్ఞానాభివృద్ధి విషయమై నిరాదరణచూపుచున్నాము. పాశ్చాత్య దేశములలో సగముధనము పిల్లల కోసము వినియోగించెదరు. వారికి చదువనేది జీవితములో ఒక ఆట’ అని బోధపడేటట్లు చూడాలి'. ఉపన్యాసముల అనంతరము శ్రీ పురిపండా అప్పలస్వామిగారు ప్రవేశ పెట్టిన ఈ క్రింది తీర్మానములు ఏకగ్రీవముగా సంగీకరింపబడినవి.

తీర్మానములు

(క) ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘమునకు శాఖగ గ్రంథాలయోద్యమమును ఈపట్నమున వ్యాపింప జేయుటకుగాను “విశాఖపట్టణ గ్రంథాలయసంఘము" అను పేరుతో నీసంఘమును స్థాపించుటకు తీర్మానించడమైనది.

(ఖ) ఈక్రింది విధముగా నీసంఘ కార్యనిర్వాహకవర్గము నెన్ను కొనడమైనది. అధ్యక్షులు:-- ఎన్. ఎస్. త్యాగరాయశాస్త్రిగారు, ఉపాధ్యక్షులు: టేకుమళ్ళ రామారావుగారు, బుద్ధిరాజు శ్రీశైల మల్లిఖార్జున రావుగారు, కార్యదర్శులు:- మల్లిమడుగుల జగన్నాథ రావుగారు, మహమ్మదు ఫజులుద్దీనుగారు. కార్యనిర్వాహక సభ్యులు:-వేపా వేంకటేశ్వర్లు, సబ్నివీసు సత్య కేశవరావు, చేబ్రోలు సీతారామచంద్రరావు, "పురిపండా అప్పలస్వామి, వంకాయల నరసింహగుప్త,వెలిదెడ్ల చూడుకుడుతమ్మ, బులుసు సూరమ్మ,వెలిదెండ్ల శ్రీనివాసరావు, తెన్నేటి విశ్వనాథము,యస్. డి. థామసు గార్లును తక్కిన గ్రంథాలయముల కార్యదర్శులును.

(గ) పరస్పరసహాయముతో కలిసి పనిచేయుటకు ఈ పట్టణములలోని గ్రంథముల పేర్లను చేర్చి “కేంద్ర పట్టిక" నొకటి తయారు చేయవలెనని ఈసభవారు తీర్మానించుచున్నారు.

(ఘ) ఈ పట్టణములోని గ్రంథాలయముల చరిత్రను తయారుచేసి జిల్లా గ్రంథాలయ సంఘకార్యదర్శి గారికి అంద జేయవలెనని తీర్మానించుచున్నారు.

(జ్ఞ) ఈ పట్టణములోని పేదలకు అందుబాటులో నుండునట్లు వారి కాలమునకు అనుగుణముగ గ్రంథములను వారికి చదివి వినిపించుటకు అవసరమయిన ఏర్పాట్లు చేయుటకు ప్రయత్నించవలెను.

(చ) ఈసంఘము యొక్క కార్యస్థానము హిందూపఠనమందిరములో పెట్టుటకు తీర్మానించడమైనది. ఇందుల కంగీకారమీయవలయునని ఆగ్రంథాలయ నిర్వాహకులను కోరుటకు తీర్మానించడమైనది. వందనములతో సభ ముగిసిన పిమ్మట ముస్లిముగ్రంథాలయమును శ్రీ వేంకట రమణయ్య ప్రభృతులు దర్శించి సదభిప్రాయముల నొసగిరి.