Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.9 (1935).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాదు. ఐహికాముష్మికసుఖముల నొఁదజేయు విజ్ఞానమును ప్రసాదించునట్టి గ్రంథరాజముల నాలయమున జేర్చుచు, అట్టి గ్రంథములను చదువువారు వీలైనపుడు చదువుకొనజాలని వారిని చేర్చి వానిని చదివి యందలి అంశములను బోధించుచు, విజ్ఞానమును వెదజల్లుచు, గ్రంథాలయము నెల్లర కుపయోగకారిగా నొనర్పవలెను. పురాణాదికాలక్షేపములును, గ్రంథాలయములలో జరుపుటవలన జ్ఞానాభివృద్ధికి తోడ్పడగలవని కొన్ని గ్రంథాలయములు ప్రత్యక్షముగ రుజువుచేయుచున్నవి. కావున ఈ విధానమును కూడ గ్రంథాలయములు అవలంబింప జ్ఞప్తి యుంచుకొనుట ఫలదాయకము. కేంద్ర గ్రంథాలయములను సంచార గ్రంథాలయములనుకూడ వీలైనచోట్లలో నెలకొల్పుట అవసరము. ప్రభుత్వము వారు గ్రంథాలయముల కిటీవల గ్రాంటుల నొసంగ బ్రారంభించినారు. కానివా రొసంగు మొత్తముగాని వారు నిర్ణయించు పద్ధతులుగాని ఉద్యమవ్యాప్తియొక్క త్వరితగమనమునకు తోడ్పడజాలకున్నవి. ఈ గ్రాంటు కోరే గ్రంథాలయమువారు, వారుకోరే గ్రాంటు మొత్తమునకు సమానమైన మొత్తమును ముందుగా సేకరించుకొని దానిని గ్రంథములకై వారు స్వయముగ వ్యయపరుప బూనినగాని, ప్రభుత్వమువారి గ్రాంటు లభ్యపడదు. అనేక గ్రంథాలయము లీ షరతును నెరవేర్పజాలక ప్రభుత్వసహాయము నపేక్షింపజాలకున్నవి. అవేక్షించునవియు బహు స్వల్ప మొత్తములనే విధి లేక కోరుకొనవలసిన దురవస్థలో జిక్కుకొని యున్నవి. ఈ నిబంధనను ఈ బీద దేశము నందాచరణయందుంచుట పాడి కాదు. దీనిని రద్దుపఱచుట అవసరమని నా అభిప్రాయము. బొత్తుగా రద్దుపఱచుట అనప్రేక్షణీయమని తలంపబడినచో ప్రభుత్వము వారిచ్చుటు గ్రాంటునకు సమానముగాక అందు పాతిక భాగముగల మొత్తమును దరఖాస్తుదారులు స్వయముగా సేకరించుకొని వ్యయపరుపవలెననిన చాలునని తోచుచున్నది. స్వయంసహాయము నంతమాత్రము బలాత్కారముగ విధించినచో గ్రంథాలయము లెక్కువగ ప్రభుత్వసహాయము నుపయోగించు కొనుటకు ఎక్కువగ్రామములలో గ్రంథాలయములు జనించి పెంపొందుటకు అవకాశముకలుగును.

గ్రామములలో గ్రంథాలయములు వృద్ధికి రావలెననిన ప్రభుత్వధనసహాయ మిప్పటికన్న ఎక్కువగ చేకూరవలయును. బరోడా సంస్థానము నందు గ్రంథాలయాభివృద్ధి యెంత త్వరితముగా వ్యాపించినదో ఆసంస్థానమువా రెంత ధారాళముగ ధనమును వ్యయపరచుచున్నారో మన ప్రభుత్వమువారు గమనించియేయున్నాగుగదా. విదేశములలో గ్రామ గ్రంథాలయము లెట్టి ఉన్నతస్థితిలో నున్నవో ప్రభుత్వము వారికి తెలిసినివిషయమేకదా. బ్రిటన్ దేశమున గాని,అమెరికా దేశమునగాని, రషియా దేశమునగాని, స్విట్జర్లాండ్ దేశమునగాని, జర్మనీ దేశమునగాని, డెన్మార్కు దేశమునగాని అత్యంత ప్రాముఖ్యమని ఎంచబడిన ఈ గ్రంథాలయోద్యమమునకు ఆయా ప్రభుత్వములవారెంత గొప్ప మొత్తములను ప్రతివత్సరము వ్యయపరచుచున్నారో మన ఆంగ్లపరిపాలకులకు తెలియనియంశములు కావుగదా. ఇంత పెద్ద మదరాసు రాష్ట్రమునకు 339 పట్టణములు, 51,487 గ్రామములు గల బ్రిటిష్ చెన్న రాష్ట్రమునకు సాలుకు ఇరువది వేలరూప్యములు గ్రంథాలయముల గ్రాంటులకై వ్యయపరచుచున్నామని ఘనముగా చెప్పుకొనుట పరిహాసాస్పదముగ గన్పింపదా?! ద్రవ్య మెచ్చటనుండి వచ్చునని ప్రభుత్వమువారు ప్రశ్నించెదరు.