Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.9 (1935).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్వపరిపాలనము ననుభవించు రషియా, అమెరికా,ఇంగ్లండు, జర్మనీ, జపాను మొదలగు దేశములెల్ల నత్యంత శీఘ్రకాలములో తమ దేశజుల నిరక్షరత్వమును రూపుమాపుకొని తమ ప్రజలలో జ్ఞానోదయమును కలిగించుకొని సర్వవిధముల నభివృద్ధిగాంచుచుండగా, ఇంగ్లాండులో నూటికి 1.8 మంది, స్కాట్రెండులో నూటికి 16, అమెరికాలో నూటికి 7.7 మంది మాత్రమే చదువు రానివారై యుండగా, మన ధర్మకర్త లనిచెప్పుకొను ఆంగ్ల దేశజుల పరిపాలనలో సుమారు 150 వత్సరములు లోబడియున్న మన దేశములో, నిప్పటికి నూటికి సుమారు 90 మంది చదువురాని వారుగా నుండుట, ఎంతటి హృదయ నిర్భేదకమగు విషాదమో, ఆంగ్లులచే ధర్మకర్తృత్వమెటుల నిర్వహింపబడుచున్నదో, మన మెట్టి నిస్సహాయస్థితిలో నున్నామో మనమనుదినము స్మరింపక తప్పదు. మన రాష్ట్రములోని జననసంఖ్య స్వదేశ సంస్థానములతో కూడ కలిపి లెక్కించిన చో 4,71,93,602. వీరిలో చదువుకొనినవారి సంఖ్య 48,67,515 చదువు రానివారి సంఖ్య 4,28,26,057. అనగా యీ రాజధానిలో నూటికి తొమ్మిదిమంది మాత్రమే చదువుకొనిన వారు, 91 మంది అక్షరజ్ఞానము బొత్తుగా లేనివారు అని 1930 వ సంవత్సరపు ప్రభుత్వ సెన్సెస్ లెఖ్కలే తెలుపుచున్నవి. స్వదేశసంస్థానముల జనసంఖ్యను వదలి వేసినచో మొత్తపు బ్రిటిష్ ఇండియాలో గల సుమారు 27 కోట్లమంది ప్రజలకు 1931-32 సంవత్సరపు లెక్కప్రకారము సుమారు 13 కోట్ల రూప్యములనుఅనగా మనిషి 1కి రు0-8-0ల వంతున మాత్రమే మన ప్రభుత్వమువారు మన దేశీయుల విద్యకై వ్యయపరచినారని మదింపు వేయబడినది. ఆంగ్లేయుల మాతృభూమియగు ఇంగ్లండు దేశమున ఒక్క లండన్ నగర రాజముననే 1933-34 లో విద్యాభివృద్ధికై 1,27,17,354 పౌండ్లు అనగా & 16,95,64,720 లు లండన్ మునిసిపాలిటీవారు మాత్రమే వ్యయపఱచి యున్నారు. అనగా లండను మునిసిపాలిటీ జనసంఖ్యయగు 44 లక్షల మంది ప్రజలకు సుమారు 17 కోట్ల రూప్యమును విద్యకై వారు వ్యయ పెట్టియుండగా, మన దేశమున బ్రిటిష్ రాష్ట్రములలోని సుమారు 27 కోట్లమంది పజలకు గవర్నమెంటు వారు, జిల్లా బోర్డులు, మునిసిపాలిటీలు అందరు కలసి సుమారు 17 కోట్ల రూప్యములు వ్యయ పెట్టుచున్నారు. అనగా ఒక్క లండన్ మునిసిపాలిటీ మాత్రమే సాలుకు మనిషి 1కి రు 38 లు వంతున వ్యయ పరచుచున్నది;మన దేశముననో ప్రభుత్వమువారు మునిసిపాలిటీలు జిల్లా బోర్డులు అందరు కలిసి మనిషి 1కి రు0-8-0 వ్యయపరచుచున్నారు. పరిస్థితు లిట్లుండగా మనలో నూటికి 91 మంది అక్షరజ్ఞానశూన్యులుగ నుండుటలో ఆశ్చర్య మేమున్నది? ప్రభుత్వము వారు ఎక్కువ ద్రవ్యమును విద్యాభివృద్ధికై వ్యయపఱచి తీవ్రమైన కార్యప్రణాళికను వెంటనే ఆచరణయందుంచి నిరక్షరత్వమును రూపుమాపిన గాని, ఏ యుద్యమమును ఏ సంస్కరణమును తృప్తికరమగు ఫలితముల నియ్యజాలదు. కాన గ్రంథాలయోద్యమాభిమాను లిందుకు తగిన యాందోళనమును నిరంతరము చేయుచుండుట అత్యంతావశ్యక మని తలంచుచున్నాను.

దుర్భర దారిద్య్రమున మగ్గుచున్నను ప్రభుత్వ సహాయము అత్యల్పముగ నున్నను నిఃస్పృహులమై ఉదాసీనులమై మనముచరించి కాలము గడపనేరము. శక్తికి తగిన పనులనైన చేసితీరవలయును. కొన్ని గ్రంథాలయములు