Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.9 (1935).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వతంసులును సహజౌదార్యసంపన్నులును సకల సదుద్యమ ప్రోత్సాహకులును కీర్తి శేషులునగు రావు బహదూర్ రేబాల లక్ష్మీ నర్సారెడ్డిగారి అభిమానమునుఒడసి వారిచే శాశ్వతముగ దానమొసంగబడిన దివ్యభవనములో నెలకొల్పబడి మా గ్రంథాలయములు సక్రమముగా పనిచేయుచున్నవని గ్రంథాల యోద్యమాభిమానులగు మీరెల్లరు వినుటకు కుతూహలులై యుందురని నేను తలంచుచున్నాను.

1911 వ సంవత్సరమున బెజవాడలో రామ మోహన గ్రంథాలయము స్థాపింపబడినపిమ్మట, గ్రంథాల యోద్యమమునకు ఆంధ్ర దేశమందంతటనెక్కువ వ్యాప్తిగలిగిన సంగతి సర్వజనవిదితమే. ఈ వ్యాప్తికి కారణభూతులై ఆంధ్రభూమియందేగాక అఖిల భారతవర్షమునందీ యుద్యముమును వ్యాపింపజేయ విశేష శ్రమపడిన కీర్తిశేషులగు సూరి వెంకట నరసింహశాగారిని మనము మరువజాలము. 1916 వ సంవత్సరము మే నెల 12 తేదిన ఆంధ్రదేశ గ్రంథాలయ ప్రతినిధుల తృతీయ మహాసభను నెల్లూరులో మేము జరిపినపుడును, 1920వ సంవత్సరము నవంబరు 20, 21 తేదులలో నెల్లూరు మండల గ్రంథాలయ మహాసభను మేము జరిపినపుడును, శ్రీశాస్త్రిగారును, శ్రీయుత అయ్యంకి వేంకటరమణయ్య పంతులుగారను మా కెంతయో తోడ్పడిరి. శ్రీశాస్త్రిగారు నాటి మండలమహాసభ కధ్యక్షతనుగూడ వహించియుండిరి. ఈ యిరువురు మహాశయుల కార్యదీక్షవలసను, వారికి ఇతరు లొసంగిన ప్రీతి పూర్వకమగు సహకారమువలనను, గ్రంథాలయోద్యమమపుడు గ్రామములకు వ్యాపించి అనేక గ్రామములలో గ్రంథాలయములుద్భవించుటకు కారణమయ్యెను. కాని ఆఉత్సాహము కొంతకాలము చెలరేగి ఆవల రాజకీయ కల్లోలమువలన తగ్గినపుడు, దేశసేనకులదృష్టి యంతయు గాంధీమహాత్ముని భారతదేశోద్ధరణ కార్యనిర్వహణసాధనమగు సత్యాగ్రహోద్యమమునందు లగ్న మైనది. స్వరాజ్యము సంపాదించుకొని పరిపాలనాయంత్రమును దేశీయుల హస్తగతము గావించుకొనిన గాని భారత దేశ శ్రేయోభివృద్ధి త్వరితగమనమున కొనసాగ నేరదనియు, భారత దేశము నాగరక ప్రపంచములో తలయెత్తుకొని తిరుగజాల దనియు, మాతృదేశాభిమానులు దృఢమనస్కులై, సర్వశక్తుల రాజకీయరంగమున వినియోగించుచు పోరాడుచుండిరి. అట్టి కారణమువలన గ్రంథాలయోద్యమ వ్యాప్తియు, కార్యక్రమమును, షుమారు 10, 12 సంవత్సరములు ఆగవలసివచ్చెను. పరిపాలకులు తీవ్రనిర్బంధన చర్యల వల్లనైననేమి, ఇతర కారణములవల్లనైన నేమి! శాసనోల్లంఘనోద్యమము ఉపసంహరించు ఆగియుండిన గ్రంథాలయోద్యమము మఱల గ్రంధాలయయాభిమానుల దృష్టి నాకర్షించుటయు, గంథాలయోద్దారక శ్రీయుత, అయ్యంకి వెంకటరమణయ్య పంతులు గారు కార్యరంగమున ప్రవేశించి సహజదీక్షతో పట్టుదలతో కార్యములు నడిపించుటయు, మరలనిపుడు ఉద్యమము నూతన తేజముతో విరాజిల్లుటయు సంభవించినవి. మఱల గ్రంథాలయ సభలు ప్రదర్శనములు ఉపన్యాసములు వార్షికోత్సవములు ఎటుచూచినను జరుగుచుండుట అత్యంత ముదావహము.

ఈ ఉద్యమవ్యాప్తికేగాక మణేయుద్యమవ్యాప్తికిని మనకు గొప్పఆటంకము మన దేశజుల బీదఱికము అజ్ఞానము నిరక్షరత్వము అని మన కెల్లరకు తెలిసినవిషయమే. వీని నెదుర్కొనుటకు మనశక్తి కొలది మనము సంసిద్ధులము కావలయును.