Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.7 (1935).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేయవలసి యున్నది. ఈ గ్రంథములను చదువుకొన్న వారిచే చదివించియు, చదువురాని వారికి చదివి వినిపించియు ఏర్పాట్లు చేయవలయును. ఏనాడు అట్లు గ్రంథాలయములను ప్రతి మనుష్యుడును ఉపయోగించి విజ్ఞానమును సంపాదించి, ఆజ్ఞానమును ఆచరణలో పెట్టునో ఆనాడే గ్రంథాలయములు తగురీతిని సేవ చేయుచున్నవిగా గ్రహించవలెను.

ఈ దినములలో, దుర్భర ఆర్థికదుస్థితిలో స్వయం సహాయముననే ఈ పని యంతయు మనమందరము చేయవలసియున్నది. ఇది యొక గొప్పపని కాదు. గ్రామమునకు ముగ్గురు సేవకులు గ్రంథాలయములకు సహకార మొనర్చినయెడల నిది యంతయు నెరవేర్చవచ్చును. శాస్త్ర గ్రంథములను కొనుటకు సొమ్ము కావలెను. అన్ని గ్రంథాలయములకు సొమ్మును చేకూర్చగల శక్తి లేకపోవచ్చును. అందువలన తాలూకా గ్రంథాలయ సంఘము తరఫున కేంద్ర గ్రంథాలయమును స్థాపించి తద్వారా అట్టి గ్రంథాలను గ్రంథాలయములకు సప్లయి చేయునట్లు తాలూకాలోని ప్రజలు అందరును పూనుకొనవలయును. రష్యా దేశములోని గ్రంథాలయములు ఏ విధముగా విద్యాభివృద్ధిని కలుగు జేసినవో ఆ దేశచరిత్రను చూచిన తెల్లమగును. 10 సంవత్సరములలో నూటికి 95 మంది విద్య లేని స్థితియందుండి నూటికి 90 మంది విద్య కలిగినవారైరి. వ్యవసాయము నూతన శాస్త్ర విధానముగా లక్షలాది యెకరముల విస్తీర్ణము మీద వ్యవసాయము వృద్ధినొందినది. కనుక స్వయంకృషి విూద గ్రంథాలయముల ద్వారా అభివృద్ధి చూపించ గలందులకు గ్రంథాలయములవారిని ప్రార్ధించుచున్నాము.

మానవసేవకంటే ఎక్కువ ధర్మము లేదు. గ్రంథాలయ సేవ మానవ సేవలో ఒక పాదము. పునాది వంటిది గనుక ఈ గ్రంథాల యాభివృద్ధి యువకుల ధర్మముగా గ్రహించి యీ తాలూకా గ్రంథాలయ సంఘము వారికి యువకులు ఎక్కువగా తోడ్పడగలందులకు కోరుచున్నాను. యువకులు చాలమంది కాలము వృథా పుచ్చుచున్న సంగతి మీ కందరకు విశదమే. జరిగిన నిమిష మొక్కటైనను మనకు తిరిగిరాదు. నిమిష నిమిషము యువకత్వము నశించిపోవుచున్నది. తిరిగి యీ అవకాశము మనజన్మలో కలుగదు. పశు పక్ష్యాదులవలె భోగవిలాసములలో కాలము గడపిన నిరరకము గనుక మానవసేవను అందు గ్రంథాలయ సేవను చేయగలందులకు కోరుచు మీరు ఈరోజున నే యీ విషయమున ప్రతిజ్ఞ తీసికొనగలందులకు మిక్కిలి వినయముతో ప్రార్థించుచున్నాను.

నూతన సంవత్సరమున కేంద్ర గ్రంథాలయమును స్థాపించు ఏర్పాటు చేయగలందులకు తాలూకా వాసులను ప్రార్థించుచున్నాను,

- పాలకోడేటి సత్యనారాయణశర్మ

కార్యదర్శి, 1-3-35