Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.5 (1935).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యాభివృద్ధికి మహానర్థకమని రాష్ట్రీయ నాయకులు పలుకుచున్నారు. అంతియేకాదు. దాని వలన కమ్మ మహా సంఘమునకు తీరని కొఱత వాటిల్లినది. రాష్ట్రీయ రాజకీయములందువలెనే సాంఘిక విషయమున గూడ వారు లేనిలోటు ఏనాటికిని తీరుట దుష్కరము. వారు తమ విద్యావివేక సంపదలచే కమ్మ మహాజనులకు గావించిన సేవ, కలిగించిన, గౌరవము అపారము, అమేయము. కమ్మ సంఘ మెన్ని తరములకైన నాయడుగారి ఋణమును తీర్చుకొనజాలదు. ఆ ఋణమును దీర్చుకొనుటకై వారెంతపాటి త్యాగము చేసినను అది అల్పమే!

నాయడుగారికి సాంఘికుల విద్యావికాసము పట్ల గల ప్రేమ నిరుపమానము. ఆకోరికను పదవ కమ్మ మహాజనసభ కధ్యక్షత వహించి అంగలూరులో సంఘీయులకు స్పష్ట పరచియుండిరి. నాటికి నేటి కది సరస్వతీ ప్రసన్నము గానే యున్నది.

శ్రీవారి ఆత్మశాంతి నభిలషింప గోరువారెల్లరు వారికోరిక మేరకు లక్షరూప్యములు కమ్మ, బీద బాలుర విద్యానిధి కొరకు సమీకరించుట ప్రథమ కర్తవ్యము.

తరువాత రైతుసంఘ క్షేమముకొరకు దీన కృషీ వలస్వత్వ సముద్ధరణము కొరకు, ఆత్మలాభాధి కారములు చూఱ పెట్టి వారు గావించిన సేవకు కృతజ్ఞతా సూచకముగా నొక స్మారక చిహ్నమును నిర్మింప ప్రయత్నించుట రైతుల పరమధర్మము . దీనిలో జాతిమత భేదము లేకుండ మద్రాసు రాష్ట్రప్రజ లందరు తమయథాశక్తికృషి సేయవలసియున్నది. ఈమహత్కార్యమునకు కమ్మ సంఘీయుల బాధ్యత అవిలంఘ్యము.

విద్యానిధి ప్రోగు చేయుటకును, స్మారక చిహ్నమును నిర్మించుటకును గతవారము మద్రాసులో సమావేశమైన కమ్మ మహాసభ వారు నిర్ణయించిరి. స్మారక చిహ్న నిర్మాణసంఘము ఏర్పరుపబడినది. పని ప్రారంభింపబడి జరుగుచున్నది. వారు పరమపదించిన పిదప ఆరుమాసములు తిరుగులోగా వారికి ప్రత్యామ్నాయముగా నీస్మారకచిహ్నమును నిర్మించి, విద్యానిధిని సమకూర్చి, భావిసంతానమున కారూపమున వారి అమోఘ సేవను చిత్రించి పెట్టుటకు సంఘము వారు తీవ్రముగా కృషి సేయుచున్నారు.


కావున, మద్రాసు రాష్ట్రప్రజ లెల్లరను ముఖ్యముగా కమ్మసంఘీయులు, ఈ స్మారక చిహ్న నిర్మాణమునకు, విద్యానిధిని ప్రోగు చేయుటకు, తమ ధనబలముల తోడ్పడగలందులకు ప్రార్థించుచున్నాను. తమకొరకై, తమ స్వత్వ గౌరవముల కొఱకై మరణించిన నాయుడు గారి కీర్తికాయమును మహోజ్వలమును గావించుట రైతుమండలి పరమధర్మమని మరొకమారు హెచ్చరించుచున్నాను.


దీనికై ప్రోగు చేయబడు ధనము, ఉత్తరత్యుత్తరములు నాకు పంపబడవలెను.

జాగర్లమూడి కుప్పుస్వామిచౌదరి, యం.ఎల్.సి.

అధ్యక్షుడు.

మునిసామి నాయడు స్మారక చిహ్న నిర్మాణసంఘము

గుంటూరు