Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.3 (1934).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4.ఎన్నఁడొ కాంచవచ్చు ననియెంచెదో ఆంధ్రమహత్త్వ; మంతలో
నెన్ని మనోజ్ఞశిల్పముల కేగతిపట్టునో; కాలగర్భమం
దెన్ని యడంగునో; యడఁగవే యనుకొందము, నీదుజీవితం
బన్నను నిక్కమా ! యిపుడ యారయు మోర్గలు ప్రాక్తనోన్నతిన్


5.చెదరి వీథులుఁ బడ్డ సింహవిగ్రహములు, గజ రాజములు మేనఁ గలుపుకొమ్ము
బల్లెంబుగొని గొచ్చవచ్చు రాహుతుమేను, శిథిలాశ్వతనువుతోఁ జేర్చుకొమ్ము
కూలిపోయిన శిలాకుంభంబులు మహోన్న, తద్వార శిరములఁ దార్చుకొమ్ము
విరిగిన రమణీయవిగ్రహావళి దేవ, నిలయకుడ్యములపై నిలుపుకొమ్ము
అవల కనుదోయి మూసి మహాంధ్ర రాజ్య, దివ్యతరరూప రేఖ చింతించుకొమ్ము
ఆంధ్రసోదర ! పూర్వ మహాంధ్ర నగర, గురుతరమహస్సు నీలోన గోచరించు


6.తొల్లిఁటియాంధశూరులు కుతూహలు లై యనిలోన వ్రాలి యీ
పల్లెకుఁ బేరు తెచ్చి రది ప్రాక్చరితంబుల గోచరించు నిం
దెల్లెడ నాంధ్రజాతి గడియించిన విక్రమ జీవితంబుల
దెల్ల మొనర్చు శిల్పసముదీర్ణశిలాశకలంబు లో సఖా!


7.వెన్నెలలోని ప్రసన్న భావంబు గ,డించి రాళ్లను రంగరించి రేమొ
జీవశూన్యములైన శిల్పముల్ పనివినఁ, జిక్కని యమృతంబుఁ జిలికీ రే మొ
పగతుర నెత్తురు పయిఁ జిల్కి క్రోంగ్రోత్త, రీతుల జిగి కుమ్మరించి రేమొ
జీలుగు బెండ్లుగఁ జేసి శైలము లెల్లఁ, గోటగా నందందుఁ గూర్చి రేమొ
మానవత్వంబుతోడ నమర్త్యభావ, మప్పు డాంధ్రులమదిని నిండారె నేమొ
తెలియఁబడ దాంధ్రనగరవీధులఁ జరించి, గండశిలలందు శిల్పంబు గాంచు వేళ


8.ఉదయభానుండు కాంతుల్లసత్కిరణసం, తతులచే రక్త చందనము బూయు
సంపూర్ణ చంద్రుండు శారదచంద్రికా,కలితసుధాభిషేకం బొనర్చు
లలితహరి తృణాకలిత భూభాగంబు, పచ్చలతోడ నివాళి యొసఁగు
రమణీయపద్మపరాగ పూరితసరో, వీచికల్ వీవనల్ విసరుచుండు
ప్రకృతి దేవత బహువిధ ప్రసవవిసర, గుచ్ఛము లొసంగు నీజాతికోట కెపుడు
శిథిల మయ్యును బూర్వసుశ్రీలఁ బడయు, నీ శిలల ప్రాభవము గాంచుమా మనస్వి!